YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధాంకర్, త్రిపుర గవర్నర్‌గా రమేశ్ బియాస్, బిహార్ గవర్నర్‌గా ఫాగు చౌహాన్, నాగాలాండ్ గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవిని నియమించారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను ఉత్తర ప్రదేశ్‌కు బదిలీ చేశారు. బిహార్ గవర్నర్ లాల్ జీ టాండన్‌ను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయా రాష్ట్రాల గవర్నర్లుగా చెలామణిలోకి వస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే. బీజేపీ సీనియర్ నేత బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఏపీకి గవర్నర్‌గా నియమించారు. ఆయన జులై 24న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా అనసూయ ఉయికెను నియమించారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికట్లో పోటీ నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుష్మా స్వరాజ్, మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు గవర్నర్ పదవులు ఇస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు కూడా గవర్నర్ పదవి వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే.. మూడో దఫా కేటాయింపుల్లోనూ వీరికి గవర్నర్ పదవుల దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. వీరితో పాటు గవర్నర్ నరసింహన్‌ కూడా బదిలీ చేస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్ విభజన నాటి నుంచి ఏపీ, తెలంగాణ.. ఇరు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉన్న ఆయణ్ని తెలంగాణకు మాత్రమే పరిమితం చేశారు. ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించారు. ఇక తెలంగాణ నుంచి ఆయణ్ని కదిపే అవకాశాలు లేనట్లే కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఒక రాష్ట్రానికి సుదీర్ఘ కాలం గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తిగా నరసింహన్ తన రికార్డును మరింత మెరుగుపరచుకోనున్నారు.

Related Posts