YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ గాడిన పడే అవకాశాలు...

కాంగ్రెస్ గాడిన పడే అవకాశాలు...

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలతో సతమతమవుతోంది. పుట్టెడు కష్టాల్లో ఉంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ వైదొలగడం, వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సర్కార్లను కూల్చివేసేందుకు కమలం ప్రయత్నిస్తుండటం పార్టీ శ్రేణులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోంది. పార్టీ మళ్లీ ఎప్పుడు గాడిన పడుతుందా? అన్న ఆలోచన వారిని తొలచి వేస్తుంది. దీనికి తోడు పార్టీ ఆర్థిక పరిస్థితి కలవర పరుస్తోంది. రోజువారీ వ్యవహారాల కోసం కూడా దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కార్యాలయ నిర్వహణ ఖర్చులకు సయితం కటకటలాడాల్సిన పరిస్థితి ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా పదిహేడో లోక్ సభ ఎన్నికల పరాజయం పార్టీని ఇంకా వీడలేదు. వందేళ్ల కాంగ్రెస్ చరిత్రలో 2014 నుంచి 2019 వరకూ అత్యంత దయనీయ పరిస్థితి. కనీసం రెండు ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు అవసరమైన స్థానాలను సయితం గెలుచుకోలేని దుస్థితి.
ఎన్నికల ఫలితాలను లోతుగా విశ్లేషిస్తే కాంగ్రెస్ దుస్థితి వెల్లడవుతుంది. మొత్తం దేశంలోని 29 రాష్ట్రాల్లో హస్తం పార్టీ కనీసం 18 రాష్ట్రాల్లో ఖాతాను తెరవలేకపోయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఇదే పరిస్థితి. ఒకప్పుడు విజయాల బాటలో కొనసాగిన ఆంధ్రప్రదేశ్ లో నేడు ఆ పార్టీకి ఒక్క ఎంపీ కూడా లేరు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, గోవా, ఛత్తీస్ ఘడ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, రాజస్థాన్ ల్లో పార్టీ చిరునామాలను కోల్పోయింది. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. గత లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే 8 సీట్లను అధికంగా గెలిచినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదాను అవసరమైన 55 సీట్లు కూడా రాలేదు. 52 స్థానాల వద్దే ఆగిపోయింది. పేరుకు అయిదు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కేరళ, పంజాబ్ ల్లో మాత్రమే గౌరవప్రదమైన స్థానాలను గెలుపొందింది. కేరళలో 20 సీట్లకు గాను 15, పంజాబ్ లో 13 సీట్లకు గాను 8చోట్ల విజయం సాధించింది. తమిళనాడులో డీఎంకే పొత్తు ఫలితంగా 8 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. వీటి తర్వాత అత్యధిక స్థానాలు సాధించింది తెలంగాణలోనే కావడం గమనార్హం. ఇక్కడ నల్లగొండ, భువనగిరి, మల్కాజ్ గిరి స్థానాల్లో పాగా వేసింది.పేరుకు కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ ను నడుపుతున్నప్పటికీ ఆ రాష్ట్రంలో 28 స్థానాలకు గాను సాధించింది ఒకే ఒక స్థానం. అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లో మొత్తం 29 స్థానాలకు గాను ఒకే ఒక్క చోట గెలిచింది. ముఖ్యమంత్రి కమల్ నాధ్ కుమారుడు తమ సొంత నియోజకవర్గమైన చింద్వారాలో గెలుపొందారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రాజస్థాన్ లో మొత్తం 25 స్థానాలకు గాను ఒక్కచోట కూడా ఖాతా తెరవలేక పోయింది. ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ మొత్తం 11 లోక్ సభ స్థానాలకు గాను కేవలం రెండు చోట్ల మాత్రమే పాగా వేయగలిగింది. పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రల్లో హస్తం పార్టీకి చేదు అనుభవాలే మిగిలాయి. యూపీలో స్వయంగా పార్టీ అధినేత రాహుల్ గాంధీ అమేధీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. అంత పెద్ద రాష్ట్రంలో రాయబరేలీ నుంచి సోనియాగాంధీ ఒక్కరు మాత్రమే గెలుపొందారు. బీహార్ లో పార్టీ ఒక్క స్థానానికే పరిమితమయింది. పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను ఒకే ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. తన భాగస్వామి ఎన్పీపీ నాలుగు స్థానాలను గెలుచుకోవడం గమనార్హం.వాస్తవానికి గెలుపొందిన 52 సీట్లలో ఎక్కువ మంది అభ్యర్థులు తమ సొంత బలంతోనే గెలిచారు. పార్టీ ప్రతిష్టకన్నా వారి వ్యక్తిగత బలమే గెలుపునకు ఎక్కువగా దోహదపడిందన్నది చేదు నిజం. పంజాబ్ లో విజయానికి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వ్యక్తిగత ప్రతిష్ట కారణమని చెప్పక తప్పదు. రాష్ట్రంలో బలమైన నాయకుడిగా ఆయనకు పేరుంది. కేరళలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు హస్తం పార్టీకి కలసి వచ్చింది. ఏడు స్థానాలు గల దేశ రాజధాని ఢిల్లీలో హస్తం పార్టీ ప్రభావం శూన్యం. స్థూలంగా చెప్పాలంటే దక్షిణాది ప్రాంతమే హస్తం పార్టీ పరువు దక్కించిందని చెప్పాలి. ఇది పార్టీ అంగీకరించాల్సిన విషయం. పరాజయాన్ని పక్కనపెడితే రోజువారీ పార్టీ నిర్వహణ కష్టంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు పార్టీని వెంటాడుతున్నాయి. రెండు నెలలుగా పార్టీ కార్యాలయ సిబ్బందికి జీతాలు కూడా అందడం లేదు. రోజు వారీ ఖర్చులను తగ్గించుకోవాలని పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్ పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ సేవాదళ్ నెలవారీ బడ్జెట్ ను 2.5 లక్షల నుంచి రెండు లక్షలకు తగ్గించారు. మహిళా విభాగం, ఎన్ఎస్‍యూఐ, యూత్ కాంగ్రెస్ విభాగాలకూ ఖర్చును తగ్గించుకోవాలన్న సూచనలు వెళ్లాయి. ఢిల్లీ అక్బర్ రోడ్డులోని ప్రధాన కార్యాలయంలో సోషల్ మీడియా విభాగంలో సభ్యుల సంఖ్య 55 నుంచి 35కు తగ్గించారు. నిర్వహణ ఖర్చులకు కటకటలాడటం, కీలక నేతలు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయానికి వచ్చే నాయకులు కూడా ముఖం చాటేస్తున్నారు. మొత్తం మీద చరిత్రలో ఎన్నడూ లేని సంక్షోభాన్ని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది.

Related Posts