Highlights
- సమావేశాలకు కామినేని దూరం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంతో ఇప్పటి వరకు మిత్రపక్షంగా ఉన్న భాజపా కూడా ఏపీ మంత్రివరం నుంచి బయటకు వచ్చేందుకు సమాయత్తమైంది. దీనితో మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు గురువారం తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలని తెదేపా నిర్ణయించిన కొద్దిసేపటికే భాజపా మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్, ఇతర నేతలు విజయవాడలో అత్యవసరంగా సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి మంత్రి కామినేని గైర్జావడం చర్చనీయాంశం. సమావేశానంతరం బుధవారం రాత్రి సమయంలో ఆకుల సత్యనారాయణ, మాధవ్‌లు విలేకరులతో మాట్లాడారు. ‘గురువారం మా మంత్రులిద్దరూ పదవులకు రాజీనామాలు చేయబోతున్నారు. రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషి గురించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనను తెదేపా తప్పుగా అర్థం చేసుకుంది. తెదేపా వైదొలగటంతో మా మంత్రులు రాజీనామా చేయబోతున్నారు. కనుక గురువారం మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరు కారు...’ అని ప్రకటించారు. మంత్రి కామినేని శ్రీనివాస్ అందుబాటులో లేకపోవటంతో ఈ సమావేశానికి హాజరు కాలేదు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం నుంచి తెదేపా వైదొలిగిన వెంటనే... రాష్ట్ర మంత్రుల పదవుల నుంచి వైదొలగాలని రాష్ట్ర భాజపా నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. భాజపా అధ్యక్షుడు హరిబాబు కామినేనితో ఫోనులో మాట్లాడారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగింది. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో గుంటూరు అతిసార ఘటనపై మంత్రి కామినేని శ్రీనివాస్ చర్చించారు. అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి... ‘మంత్రి హోదాలో ఇది చివరి సమావేశమా’ అని ప్రశ్నించగా... ‘భాజపా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వల్లనే నేనీస్థాయికొచ్చాను. పార్టీ అధిష్ఠానవర్గం ఏమి చెబితే తు.చ.తప్పకుండా పాటించేందుకు సిద్ధంగా ఉన్నాను. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివృద్ధికి అవిరళ కృషి చేస్తున్నారని...’ కామినేని సమాధానమిచ్చారు.