యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్ ’ షూటింగ్‌లో హీరో రామ్ చరణ్ మరోసారి గాయపడ్డారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా మొదలైన తరవాత ఇప్పటికే ఒకసారి చరణ్ గాయపడ్డారు. ఆయన కాలికి బలమైన గాయం కావడంతో మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన మరోసారి గాయపడ్డారనే వార్త వైరల్ కావడంతో మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కొంత మంది అయితే ఏకంగా రాజమౌళిని తిట్టిపోస్తున్నారు. నిజానికి ఇది రూమర్ మాత్రమే. రామ్ చరణ్ గాయపడ్డారనే వార్త అబద్ధం. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయపడ్డారంటూ వస్తోన్న వార్తల్లో నిజంలేదని, ఆయన ఎంతో సురక్షితంగా ఉన్నారని పీఆర్‌ఓ వంశీ కాక ట్వీట్ చేశారు. నిన్న, ఈరోజు ఆయన షూటింగ్‌లో కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ రూమర్ మరింత వైరల్ కాకముందే అడ్డుకట్ట వేశారు. వాస్తవానికి రాజమౌళి
సినిమా అంటే హీరోలకు కష్టం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అంతమాత్రాన హీరో గాయపడితే ఆయన్ని నిందించడం ఎంత వరకు సమంజసం. ప్రస్తుతం ఆయనపై నిందలు వేస్తున్నవారు.. సినిమా అద్భుతంగా వస్తే ప్రశంసల వర్షం కురిపిస్తారు. కాబట్టి, రూమర్లు నమ్మడం మాని.. ముందు జక్కన్నను గౌరవిద్దాం. ఇక, ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ అనంతరం చిత్ర యూనిట్ పుణే వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ భారీ షెడ్యూల్ ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జూలైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.