యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘కథనం’. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించారు. ది గాయత్రి ఫిల్మ్స్, ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై బి.నరేంద్రరెడ్డి, శర్మచుక్కా సంయుక్తంగా నిర్మించారు. రోషన్ సాలూరి సంగీతం సమకూర్చారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీని అందించారు. అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ప్రారంభమై ఏడాది పైగా కావస్తోంది. కిందటేడాది దసరా పండుగ సందర్భంగా ‘కథనం’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఆ తరవాత ప్రెస్ మీట్ పెట్టి సినిమా విశేషాలు వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో ఒక టీజర్ వదిలారు. ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. కానీ, ఆ తరవాత ప్రచారం నిర్వహించకపోవడం.. ట్రైలర్ కానీ, ప్రోమోలు కానీ రిలీజ్ చేయకపోవడంతో ఈ సినిమాను ప్రేక్షకులు మరిచిపోయారు. మొత్తానికి ఈ సినిమా అన్ని కార్యక్రమాలు
పూర్తిచేసుకుని ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కిందటేడాది ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనసూయ.. ఇప్పుడు ఈ ‘కథనం’తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి. కాగా, సినిమా విడుదల తేదీని ప్రకటించిన నిర్మాత నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ‘అనసూయ ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన చిత్రమిది. ఆమె కెరీర్‌లో ఇదొక బ్లాక్ బస్టర్ చిత్రమవుతుందని నమ్మకం ఉంది. సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలు లభించాయి. ఆగస్ట్ 9న సినిమాను విడుదల చేస్తు్న్నాం’ అని అన్నారు. ఇప్పటి వరకు సినిమాలకు పంపిణీదారుడుగా ఉన్న నరేంద్ర రెడ్డి ఈ చిత్రంతో నిర్మాతగా మారారు.