యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్ణాటకలో ఆపరేషన్ కమలం పూర్తయ్యింది. దీంతో బీజేపీ తదుపరి లక్ష్యం మధ్యప్రదేశ్ అని భావించారంతా. దీనికి కారణాలు లేకపోలేదు. మోదీ, అమిత్ షా కనుసైగ చేస్తే చాలు 24 గంటల్లోనే మీ ప్రభుత్వం కూలిపోతుందని అర్థం వచ్చేలా.. అసెంబ్లీలోనే బీజేపీ నేత వ్యాఖ్యానించారు. దీంతో ఆపరేషన్ కమలం మధ్యప్రదేశ్‌లో మొదలైనట్టేనని భావించారు. కానీ కర్ణాటకను చేజార్చుకున్న కాంగ్రెస్.. ఇక్కడ ఆపరేషన్ కమల్‌నాథ్‌ను ప్రారంభించింది. శాసనసభలో నీ ప్రభుత్వం కూల్చేస్తాం జాగ్రత్త అని పరోక్షంగా తనకే వార్నింగ్ ఇచ్చిన కమలనాథులకు సీఎం కమల్‌నాథ్ ఝలక్ ఇచ్చారు. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సొంత పార్టీకి షాకిచ్చారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం క్రిమినల్ లా చట్ట సవరణకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ ఓటింగ్ సందర్భంగా.. బీజేపీ ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠి, శరద్ కౌల్‌లు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. అంతేకాదు బుధవారం రాత్రి సీఎం కమల్‌నాథ్ ఇచ్చిన విందులో వీరు పాల్గొన్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మాట్లాడుతూ.. ‘మీది మైనార్టీ ప్రభుత్వం, ఏరోజైనా కూలిపోతుందని ప్రతిరోజూ బీజేపీ ఆరోపిస్తోంది. ఈరోజు అసెంబ్లీలో ఆ పార్టీకే చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మా ప్రభుత్వానికి మద్దుతుగా ఓటేశార’’ని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటేసిన మైహార్ ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి మాట్లాడుతూ.. ఇది ఘర్ వాపసీ అన్నారు. 2014లో ఆయన హస్తాన్ని వీడి బీజేపీలో చేరారు. కర్ణాటకలతో కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. బలపరీక్ష సందర్భంగా విప్ జారీ చేసినప్పటికీ ఈ పార్టీలకు చెందిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. దీంతో విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓడారు. తమ చేతికి మట్టి అంటకుండా బీజేపీనే ఇలా చేసిందని కాంగ్రెస్, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోనూ ఇలా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆపరేషన్ కమలానికి చెక్ పెట్టేలా ద్వారా కాంగ్రెస్ పార్టీ ముందుగా మేల్కొని ఆపరేషన్ కమల్‌నాథ్ చేపట్టింది.