YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజకీయాలు వద్దు - రవిశంకర్ ప్రసాద్

ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజకీయాలు వద్దు -  రవిశంకర్ ప్రసాద్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

 చట్టం దృష్టిలో మహిళలంతా సమానులేనని, మతంతో సంబంధం లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్సభలో చర్చకు ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ బిల్లుపై రాజకీయాలు చేయరాదని తెలిపారు. భర్త తన భార్యకు తక్షణం మూడుసార్లు తలాక్ చెప్పి, ఆమెకు విడాకులు ఇవ్వడం మతపరమైన అంశం కాదన్నారు. ఇది భారతీయ ముస్లిం మహిళల గౌరవ, మర్యాదలకు సంబంధించిన విషయమని వివరించారు.
షరియా చట్టం ప్రకారం సరైనది కానిదానిని సాధారణ చట్టంలో కూడా సరిదిద్దవలసి ఉందన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, ఒక న్యాయమూర్తి ట్రిపుల్ తలాక్ నిరంకుశమైనదని, రాజ్యాంగ విరుద్ధమని, దీనిని రద్దు చేయాలని చెప్పారన్నారు. మరొక న్యాయమూర్తి ట్రిపుల్ తలాక్ చట్ట ప్రకారం తప్పు అని పేర్కొన్నారన్నారు. తక్షణ ట్రిపుల్ తలాక్ విధానానికి వ్యతిరేకంగా ఓ చట్టాన్ని ఆమోదించాలని మరొక న్యాయమూర్తి చెప్పారన్నారు.
ఇటీవల ఉత్తర ప్రదేశ్లో ఓ మహిళకు ఆమె భర్త విడాకులు ఇచ్చిన విషయాన్ని రవిశంకర్ ప్రసాద్ ప్రస్తావించారు. తన పళ్ళను పొగాకుతో తోముకోవడం బానో అనే మహిళకు అలవాటని, దీనిని వ్యతిరేకించిన ఆమె భర్త ఆమెకు తక్షణం మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులిచ్చేశాడని పేర్కొన్నారు. తన భర్త, అతని తరపు బంధువులు తనను కట్నం కోసం వేధిస్తున్నారని ఆమె ఆరోపించారని పేర్కొన్నారు. ఆమెకు వివాహం జరిగి ఏడు నెలలైందని చెప్పారు.
 దాదాపు 20 దేశాలు తక్షణ ట్రిపుల్ తలాక్ను రద్దు చేశాయని, లౌకికవాదాన్ని అనుసరిస్తున్న భారత దేశం ఆ పని ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. ఈ బిల్లును రాజకీయ కోణంలో చూడరాదన్నారు. ఇది మతపరమైన సమస్య కాదని, భారతీయ ముస్లిం మహిళల గౌరవ, మర్యాదలకు సంబంధించిన విషయమని తెలిపారు. మతంతో సంబంధం లేకుండా, చట్టం దృష్టిలో మహిళలంతా సమానులేనన్నారు. ముస్లిం మహిళలను వారి విధికి వారిని ఎందుకు వదిలిపెట్టాలని నిలదీశారు. సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని చెప్పినప్పటికీ, ఆ తీర్పు వెలువడిన తర్వాత ఈ నెల 24 వరకు 345 తక్షణ ట్రిపుల్ తలాక్ కేసులు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. స్త్రీ, పురుషులకు సమాన న్యాయం జరగాలన్నారు. అదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Related Posts