YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

డియర్ కామ్రేడ్... కొత్త సీసాలో పాత సారా

డియర్ కామ్రేడ్... కొత్త సీసాలో పాత సారా

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

మనం ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు, దాన్ని సాధించడానికి ఎంతటివారికైనా ఎదురెళ్తున్నప్పుడు.. మనలో ధైర్యం నింపుతూ మనకు తోడుగా వచ్చేవాడే కామ్రేడ్. తన ప్రేమను గెలిపించుకోవడానికి, తాను ప్రేమించిన అమ్మాయి జీవితంలో గెలవడానికి ఆమెకు జీవితాంతం తోడుగా ఉండే కామ్రేడే ఈ ‘డియర్ కామ్రేడ్’. హిట్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన రెండోసారి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగు దక్షిణాది భాషల్లో తెరకెక్కి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ ‘డియర్ కామ్రేడ్’ ప్రేక్షకులను మెప్పించాడో లేదో రివ్యూలోకి వెళ్లి చూద్దాం. చైతన్య అలియాస్ బాబీ (విజయ్ దేవరకొండ) కాకినాడకు చెందిన అబ్బాయి. కాలేజీలో స్టూడెంట్ యూనియన్ లీడర్. తనవాళ్ల కోసం ఎవరినైనా ఎదిరించగలిగే కామ్రేడ్. ఎప్పుడూ స్ట్రైక్‌లు, గొడవలు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన అపర్ణాదేవి అలియాస్ లిల్లీ (రష్మిక మందన) రాష్ట్ర స్థాయి క్రికెట్ ప్లేయర్. నేషనల్ టీమ్‌కు ఎంపిక కావాలన్నది తన లక్ష్యం. బాబీ పక్క ఇంటిలో ఉండే కుటుంబానికి లిల్లీ దూరపు బంధువు. హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చిన లిల్లీ.. బాబీ ప్రేమలో పడుతుంది. కానీ, అక్కడ బాబీ ఆవేశం, గొడవలు పడటం చూసి అతనికి దూరంగా వెళ్లిపోతుంది. మూడేళ్ల తరవాత అనుకోని పరిస్థితుల్లో బాబీ.. లిల్లీని చూస్తాడు. ఆమె మానసిక రుగ్మతతో బాధపడుతుంటుంది. అసలు ఆమెకు ఏమైంది? బాబీని విడిచివెళ్లిపోవడం వల్లే ఆమె అలా అయిపోయిందా? లేక ఇంకేమైనా కారణం ఉందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తెలుగు ప్రేక్షకులకు ప్రేమకథలు కొత్తేమీకాదు. ఇప్పటి వరకూ టాలీవుడ్‌లో చాలా ప్రేమకథలే వచ్చాయి. కానీ, విజయ్ దేవరకొండ హీరోగా నటించాడంటే ఆ ప్రేమకథలో ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఊహిస్తారు. సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంటారు. ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా లేదు. కథ పాతదే అయినా దానిలో నేపథ్యం బాగుంది. ఈ కథలో బలమైన సందేశం కూడా ఉంది. ఆడపిల్లలు తమ లక్ష్యం కోసం కష్టపడుతున్నప్పుడు వాళ్లకు వచ్చే అడ్డంకులకు భయపడకుండా తల్లిదండ్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు వాళ్లకు ధైర్యం చెప్పాలని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు సందేశాన్ని ఇచ్చారు. సినిమా ఫస్టాఫ్‌లో బాబీ, లిల్లీ ప్రేమకథను దర్శకుడు చాలా అందంగా చూపించారు. కాలేజీ గొడవలు, రాజకీయాలు సినిమాల్లో మనకు కొత్తేమీ కాదు. ఇందులోనూ అవే చూపించారు. కానీ, ప్రేమకథ మాత్రం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. సరదా సరదా సన్నివేశాలు, లవ్ సీన్స్, కాలేజీ గొడవలతో ఫస్టాఫ్ గడిచిపోతుంది. కానీ, సెకండాఫ్‌కు వచ్చే సరికి కథనం బాగా నెమ్మదించింది. లిల్లీ క్రికెట్‌ను పూర్తిగా వదిలిపెట్టడానికి గల కారణం తప్ప ఇంకేమీ ట్విస్టులు ఉండవు. చాలా సాదాసీదాగా సాగుతుంది కథనం. సెకండాఫ్‌లో కూడా విజయ్, రష్మిక మధ్య సన్నివేశాలే బలం. క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని బాబీ కొట్టే సన్నివేశం కూడా ప్రేక్షకుడిలో ఉద్వేగాన్ని బయటికి తెస్తుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా సీరియస్‌గా సాగుతుంది. కాస్త కామెడీని జోడించి ఉంటే ప్రేక్షకుడికి ఉపశమనం లభించేది. మొత్తంగా చూసుకుంటే, కొత్త దర్శకుడు భరత్ కమ్మ ఒక సందేశాత్మక కథను చాలా సహజసిద్ధంగా ప్రేక్షకులకు వెండితెరపై చూపించే ప్రయత్నం చేశారు. కానీ, కథనాన్ని మాత్రం బలంగా రాసుకోలేకపోయారు. ఇలాంటి స్లో నెరేషన్‌తో కూడిన సినిమాలు అందరికీ నచ్చకపోవచ్చు. సినిమాకు ప్రధాన బలం హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన. విజయ్ ఎప్పటిలానే తన నటనతో కామ్రేడ్ పాత్రకు ప్రాణం పోశారు. ఇక రష్మిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటన అద్భుతం. ప్రస్తుత సినిమాల్లో హీరోయిన్లకు ఇంత నిడివి ఉన్న పాత్రలు దక్కడం లేదు. కానీ, తనకు దక్కిన అవకాశాన్ని రష్మిక సద్వినియోగం చేసుకున్నారు. వంద శాతం న్యాయం చేశారు. తెరపై విజయ్, రష్మిక కెమిస్ట్రీ అయితే అమోఘం. ఈ జంటను ‘గీత గోవిందం’లో చూశాం. కానీ, అంతకు మించి ఈ చిత్రంలో కెమిస్ట్రీ ఉంది. నిజమైన ప్రేమికులులా చాలా రియలిస్టిక్‌గా చేశారు. వీళ్లిద్దరూ లేకపోతే ఈ సినిమా లేదు అనేలా చేశారు. ఇక మిగిలిన నటీనటులంతా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమా సాంకేతికంగా చాలా బాగుంది. మైత్రీ మూవీస్, బిగ్ బెన్ సినిమాస్ స్థాయికి తగ్గట్టే నిర్మాణ విలువలు బాగున్నాయి. కాకినాడ, హైదరాబాద్, కశ్మీర్‌లో సినిమాను తెరకెక్కించారు. సినిమాటోగ్రాఫర్ సుజీత్ సారంగ్ కశ్మీర్‌ను ఎంత అందంగా చూపించారో కాకినాడనూ అంతే బాగా చూపించారు. కాకినాడలో డ్రోన్ కెమెరా సహాయంతో తీసిన సన్నివేశాలు మంచి అనుభూతినిస్తాయి. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ఈ సినిమాకు మరో బలం. మంచి పాటలతో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. ఎడిటర్ శ్రీజిత్ సారంగ్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమా నిడివి కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది

Related Posts