YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జమ్మూకు భారీగా భద్రతా దళాలు

జమ్మూకు భారీగా భద్రతా దళాలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాలు కొనసాగిస్తున్న ఉగ్రవేటకు మరింత ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి అదనంగా మరో 10 వేల మంది భద్రతా బలగాలను పంపాలని నిర్ణయించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం కొద్దిరోజుల్లోనే జమ్మూ కశ్మీర్‌కు 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను పంపనున్నట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్ లోయలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో పర్యటించి అక్కడి శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. ఆయన కశ్మీర్ నుంచి తిరిగి వచ్చిన రెండు రోజులకే కేంద్రం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైనికులను విమానాల్లో జమ్మూ కశ్మీర్‌కు తరలించనున్నట్టు సమాచారం. అమర్‌నాథ్ యాత్రను విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల 40 వేల అదనపు బలగాలను జమ్మూ కశ్మీర్‌కు పంపింది. అంతకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 14న దాదాపు 100 కంపెనీల బలగాలు రాష్ట్రానికి తరలివెళ్లాయి. లోక్‌సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకే అదనపు బలగాలను పంపుతున్నట్టు అప్పట్లో కేంద్రం ప్రకటించింది. జమాతే ఇస్లామీ సంస్థపై నిషేధం అనంతరం దీనికి చెందిన కీలక నేతలు, మద్దతుదారులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి.  కాగా ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ రాష్ట్రపతి పాలన కింద కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Related Posts