మరో నెల రోజుల తరువాత స్మార్ట్ ఫోన్లు, ముఖ్యంగా హై ఎండ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రస్తుతం ఎటువంటి పన్నులూ లేని పీసీబీ (ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు), కెమెరా మాడ్యూల్స్, డిస్ ప్లే ప్యానల్స్ పై కస్టమ్స్ సుంకాలను విధించవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే, స్మార్ట్ ఫోన్ల నుంచి ల్యాప్ టాప్ ల వరకూ అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలపైనా ప్రభావం పడుతుంది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత కస్టమ్స్ సుంకం మాత్రమే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందన్న సంగతి తెలిసిందే.
కాగా, పలు భారత కంపెనీలు విదేశాల నుంచి విడిభాగాలు తెచ్చి, ఇక్కడ వాటిని క్రమ పద్ధతిలో అమర్చి సెల్ ఫోన్లు వంటి ప్రొడక్టులను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. సుంకాలు లేకుండా వీటి దిగుమతికి అనుమతిస్తున్న కారణంగా, తయారీ రంగం వృద్ధిని సాధించడంలో విఫలమవుతోందన్నది కేంద్రం అభిప్రాయం. ఇండియాను తయారీ హబ్ గా మార్చాలంటే, కస్టమ్స్ సుంకాలను పెంచాలని భావిస్తోంది. కాగా, గత జూలైలో మొబైల్ ఫోన్ల దిగుమతిపై 10 శాతం సుంకాలు విధించిన కేంద్రం, డిసెంబర్ లో దీనిని 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.