YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎట్ట కేలకు క్షమాపణలు చెప్పిన ఆజంఖాన్‌

 ఎట్ట కేలకు క్షమాపణలు చెప్పిన ఆజంఖాన్‌

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

భాజపా మహిళా ఎంపీ రమాదేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌ క్షమాపణలు చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీలకతీతంగా మహిళా ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలతో భేటీ అయిన స్పీకర్ ఓం బిర్లా ఆజంఖాన్‌ క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం లోక్‌సభ ప్రారంభం కాగానే ఆజంఖాన్‌ మాట్లాడేందుకు స్పీకర్‌ అనుమతినిచ్చారు. అనంతరం సభాసమక్షంలో ఆయన క్షమాపణలు తెలిపారు. ‘నేను 9 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను. మంత్రివర్గ బాధ్యతలు చేపట్టా. రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగానూ వ్యవహరించా. చట్టపరమైన విధానాల గురించి నాకు తెలుసు. ఒకవేళ నా వ్యాఖ్యలు ఎవర్నైనా బాధించి ఉంటే అందుకు నేను క్షమాపణలు చెబుతున్నా’ అని ఆజంఖాన్‌ తెలిపారు. సభలో ఆజంఖాన్ అటూఇటూ చూస్తూ మాట్లాడుతుండగా... తనవైపు చూసి మాట్లాడాలని ఆ రోజు చైర్ లో వున్న పానెల్ స్పీకర్ రమాదేవి సూచించారు. దీనికి సమాధానంగా, 'నాకు కూడా మీ కళ్లలోకి చూస్తూ మాట్లాడాలనే ఉంది' అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి.ఆ తర్వాత స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ.. సభ్యులు ప్రసంగించేప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి అనుచిత పదాలు ఉపయోగించకుండా సభ మర్యాదను కాపాడాలని కోరారు. అప్పుడే ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉంటాయన్నారు. అయితే ఈ క్షమాపణలు తాను అంగీకరించబోనని భాజపా ఎంపీ రమాదేవి అన్నారు. ‘ఆయన నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారు. ఆజంఖాన్‌ ప్రవర్తన మహిళలతో పాటు యావత్‌ దేశాన్ని బాధిస్తోంది. ఆయన తన మాట తీరును మార్చుకోవాలి’ అని రమాదేవి హితవు పలికారు. ట్రిపుల్‌ తలాక్‌పై చర్చ సందర్భంగా భాజపా ఎంపీ రమాదేవిపై ఆజంఖాన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చర్చ సందర్భంగా మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ మాట్లాడుతుండగా ఎస్పీ నేత ఆజంఖాన్‌ పలుమార్లు అడ్డుపడ్డారు.

Related Posts