యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
మావోయిస్టుల వారోత్సవాల నేపధ్యంలో భద్రతాదళాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. తాజాగా సోమవారం ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు చనిపోగా, భద్రతాబలగాల తరఫున ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు సుక్మా జిల్లాలోని కొంటా అటవీప్రాంతంలో సమావేశమైనట్లు నిఘా సమాచారం అందింది. దీంతో భద్రతాబలగాలు భారీ ఎత్తున కూంబింగ్ జరిపాయి. అయితే కొంటా అడవిలో కొద్దిదూరం వెళ్లగానే బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు చనిపోగా, మిగతావారు కాల్పులు జరుపుతూ పరారయ్యారు. కాగా, ఘటనాస్థలం నుంచి ఇద్దరు మావోల మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నిషేధిత సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని సుక్మా ఎస్పీ శలభ్ శర్మ తెలిపారు. మిగిలిన మావోయిస్టుల కోసం కూంబింగ్ ను ముమ్మరం చేశామని చెప్పారు