యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సంకీర్ణ ప్రభుత్వం కూలి బీజేపీ ప్రభుత్వం ఏర్పడినా ఆపరేషన్ కమల ఆగేటట్టు లేదనిపిస్తోంది. 17మంది ఎమ్మెల్యేల రాజీనామాలు, వారిపై అనర్హత వేటు పడ్డంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. తాజాగా జేడీఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేతోపాటు ఆరుగురు బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అనర్హత వేటు పడుతుందనే భయంతో వెనుకంజ వేసినవారంతా సిద్ధమైనట్టు తెలుస్తోంది. యడియూరప్ప బలనిరూపణలో నెగ్గడం, స్పీకర్ రమేశ్‌కుమార్ రాజీనామా చేయడంతో వీరు ఆరుగురు కమలదళంలో చేరే ఆలోచనలో ఉన్నారు. వీరు కొత్త స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ముగిశాక రాజీనామాలు చేయనున్నట్టు కథనం. కొత్త స్పీకర్ అయితే రాజీనామా చేస్తే వెంటనే ఆమోదిస్తారని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం అనర్హత వేటుపడిన 17మంది బెంగళూరు, మైసూరు ప్రాంతాలకు చెందినవారు. ప్రత్యేకించి మైసూరు ప్రాంతంలో బీజేపీకి అంతగా బలం లేదు. ఉప ఎన్నికలు జరిగి మరోసారి 17స్థానాల్లో ఎక్కువ చోట్ల కాంగ్రెస్, జేడీఎ్‌సలు గెలుపొందితే ఆరు నెలల తర్వాత బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగలనుంది. అందుకోసం ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన ఆరుగురి చేత రాజీనామా చేయించి అక్కడ బీజేపీ తరపున వారినే గెలిపించుకుంటే 40 నెలల పాలనకు ఢోకా ఉండదని బీజేపీ వ్యూహం పన్నింది. ప్రస్తుతం 17 స్థానాలలో కొన్నింటిని సాధించుకుని ఉత్తర కర్ణాటకలో ఆరింటిని సొంతం చేసుకుంటే శాసనసభలో నిరంతరంగా బలం ఉంటుందని అభిప్రాయపడింది.