అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ క్రియాశీలకంగా ఉందని, పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా, హక్కానీ నెట్‌వర్క్ లాంటి ఉగ్రవాద సంస్థలతో ఇది సన్నిహితంగా ఉంటూ వారికి సాయపడుతోందని ఐక్యరాజ్యసమితి నివేదిక స్పష్టం చేసింది. కానీ, ఆ సంస్థ నాయకుడు మహ్మద్ అల్ జవహరీ ఆరోగ్యకారణాల రీత్యా వారు ఎంతవరకు వారితో కలిసి పనిచేస్తున్నారనేది సందేహించాల్సిన అంశమేనని పేర్కొంది. ఐరాస భద్రతా మండలి ఆంక్షల పర్యవేక్షణ కమిటీ 24 వ నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ముస్లిం దేశాలు, అల్‌ఖైదా దాని అనుబంధ గ్రూప్‌లకు సంబంధించి ఈ కమిటీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్వతంత్ర నివేదికను సమర్పిస్తుంది. ఇది అఫ్ఘనిస్థాన్‌ను తమకు సురక్షిత స్థావరంగా భావిస్తోందని, తాలిబన్లతో దీర్ఘకాలిక, బలమైన సంబంధాలు ఏర్పరచుకుందని నివేదికలో పేర్కొంది.
తాలిబన్ల ప్రాపకంతో బదాక్షన్ ప్రావిన్సుల్లో ముఖ్యంగా తజికిస్థాన్ సరిహద్దుల్లోని షింగానన్‌తోపాటు పక్తియా ప్రావిన్సులోని బర్మాల్‌లో ఉనికి చాటుకుంటోంది. లష్కరే తొయిబా, హక్కానీ ఉగ్రవాద సంస్థలకు సన్నిహితంగా ఉంటూ సహకారం అందజేస్తోన్న అల్‌ఖైదా సభ్యులు తాలిబన్ల మిలటరీ, మతపరమైన ఆదేశాలను అనుసరిస్తున్నారు. అంతేకాదు నిర్వీర్యమైందని భావిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ (ఐఎస్ఐఎల్) సైతం కొన్ని మూరుమూల ప్రాంతాల్లో తన కార్యకలాపాలు కొనసాగిస్తోందని వివరించింది. ఈ ఉగ్రవాద గ్రూప్‌లకు చెందిన అనుబంధ సంస్థలు నిధులు, తమ సిద్ధాంతాల ప్రచారానికి సహాయపడుతున్నాయని, కాలక్రమేణా తమ ఎజెండాలతో ప్రాంతీయవాదంపై ప్రభావం చూపుతున్నాయని ఐరాస నివేదిక వెల్లడించింది.
అల్‌ఖైదా ఇప్పటికే ఈ ప్రక్రియలో చురుకుగా ఉందని తెలిపింది. స్థానిక అంశాలు, రాజకీయ విషయాలలో జోక్యం చేసుకుని కొంత వరకు విజయం సాధించినా, కొన్ని సమస్యలను ఎదుర్కొందని నివేదిక వివరించింది. సిరియా రిపబ్లిక్, యమొన్, సోమాలియా, పశ్చిమ ఆఫ్రికాలోని ఐఎస్ఐఎల్ ఉగ్రవాదులతో పోలిస్తే అల్‌ఖైదా బలంగా ఉందని తెలిపింది. క్రియాశీలకంగా ఉన్న విదేశీ ఉగ్రవాదుల్లో అత్యధికంగా ఇద్లిబ్, ఆఫ్ఘనిస్థాన్‌లో ఉండగా వీరిలో ఎక్కువ మంది అల్-ఖైదాతో కలిసి ఉన్నారని వివరించింది. అయితే, ఆర్థిక, మీడియా ప్రొఫైల్, పోరాటాలు, అనుభవం, ఉగ్రవాద నైపుణ్యం పరంగా అల్-ఖైదా కంటే ఐఎస్ఐఎల్ చాలా బలంగా ఉందని, ఇది ప్రపంచ భద్రతకు మరింత ముప్పుగా పరిణమిస్తుందని నివేదిక పేర్కొంది.
ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సోమాలియాలో ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కోవడానికి స్థానిక అధికారుల సామర్థ్యం కూడా పరిమితంగా ఉందని నివేదిక నొక్కి చెప్పింది. శ్రీలంకలో మారణహోమం సృష్టించి ఐఎస్ఐఎల్ 258 మందిని పొట్టనబెట్టుకుంది.అయితే, శ్రీలంకలో బాంబు పేలుళ్లకు ఈ సంస్థ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సహకారం అందజేయకుండానే అనుకున్నది పక్కాగా అమలుచేసిందని విచారణలో తేలింది. ఐఎస్ఐఎల్ తన భావజాలాన్ని స్థానిక యువతలో జొప్పించి దాడికి ప్రేరేపించింది.
గతేడాది సాయుధ పోరాటాల్లో 12,000 మందికిపైగా బాలలు బలయ్యారని, వీరిలో అత్యధికంగా ఆఫ్ఘనిస్థాన్, పాలస్తీనా, సిరియా, యెమొన్‌కు చెందిన వారేనని తెలిపింది. ప్రాణాలు కోల్పోయినవారు, గాయపడినవారు మొత్తం 24 వేలకుపైగా ఉన్నారని, వీరిలో లైంగిక దాడులు, అపహరణ, పాఠశాలలు, హాస్పిటల్‌లో దాడులు తదితర ఘటనల్లో బాధితులే ఎక్కువగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది.