యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నేత్రావతి బ్యాక్ వాటర్ లో లభ్యమైన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మృతదేహం. ఈనెల 29న సాయంత్రం నేత్రావతి నది వంతెనపై వెళ్తుండగా డ్రైవర్‌ను కారు పక్కకు నిలపాలని సిద్ధార్థ సూచించారు. వంతెనపై నడుస్తూ సాయంత్రం 6:30వరకు ఫోన్‌లో మాట్లాడారు. కొద్ది సేపటి తర్వాత ఆయన కనిపించకపోవడంతో డ్రైవర్ ఆందోళన చెంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, డ్రైవర్ సమాచారంతో పోలీసులు
రంగంలోకి దిగారు. మంగళవారం ఉదయం నుంచి మూడు పోలీసు బృందాలు ఓవైపు, ఎనిమిది పడవల సాయంతో గజ ఈతగాళ్లు, తీర ప్రాంత గస్తీదళం, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మరోవైపు నేత్రావతి నదిలో గాలింపు చేపట్టాయి. నదిలో ఎనిమిదో స్తంభం వద్ద ఓ వ్యక్తి నీటిలో దూకడం చూశానని స్థానిక జాలరి ఒకరు వెల్లడించినట్లు మాజీ మంత్రి యు.టి.ఖాదర్ తెలిపారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్నందున రక్షించే సాహసం చేయలేకపోయినట్లు ఆ జాలరి తెలిపారు.