యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కావలి ప్రతిభా భారతి. టీడీపీ రాజకీయాల్లో ఆమెదో అధ్యాయం. అయితే, నేటి రాజకీయాల్లో పోటీ పడలేక, సాంత పార్టీలోనే కుంపట్లు పెట్టుకుని మాడి మసైపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఘనమైన గతం ఉన్నప్పటికీ.. భవిష్యత్తును శూన్యం చేసుకున్నారు. అన్నగారు ఎన్టీఆర్ టీడీపీని ప్రారంబించిన తర్వాత శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు విజయం సాధించిన ప్రతిభా భారతి.. విద్యాశాఖ మంత్రిగా పదేళ్లు చక్రం తిప్పారు. తర్వాత చంద్రబాబు కూటమిలో చేరిన నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా ఆమెకు స్పీకర్ పదవిని అప్పగించి గౌరవించారు చంద్రబాబు.ఇక, 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఎచ్చెర్ల నియజకవర్గం జనరల్ అయ్యి రాజాం ఎస్సీ నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడ ప్రతిభా భారతి తనదైన శైలిలో రాజకీయాలు చేయలేక పోయారు. ముఖ్యంగా ప్రస్తుత టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో ఘర్షణకు దిగి..ఆమె రాజకీయంగా అధః పాతాళానికి చేరిపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2009లో రాజాం నుంచి వ్యూహాత్మకంగా వైఎస్ రాజశేఖరరెడ్డి.. యువ నాయకుడు కొండ్రు మురళిని రంగంలోకి దింపారు. ఆయనపై పోటీ చేసిన ప్రతిభా భారతికి అంతర్గత శత్రువులు పెరిగిపోయిన కారణంగా సొంత పార్టీ నాయకులే ఆమె ఓటమికి చక్రం తిప్పారు. దీంతో ప్రతిభా భారతి ఘోరంగా ఓడిపోయారు.2004లో ఎచ్చెర్లలో ప్రతిభా భారతిపై నెగ్గిన కోండ్రు 2009లో రాజాంలోనూ మరోసారి ఆమెను ఓడించారు. వరుసగా రెండుసార్లు ఓడిపోవడంతో ప్రతిభా భారతి ఐదేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈలోగా రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో ఆమె పూర్తిగా పార్టీకి దూరంగానే ఉండాల్సి వచ్చింది. అయినా.. చంద్రబాబు ఆమెకు 2014లో మరోసారి టికెట్ ఇచ్చారు. అయితే, అప్పుడు కూడా వైసీపీ నేత కంబాల జోగులు చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. 2014లో ప్రతిభా భారతి కేవలం 500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమికి ఆమె స్వయంకృతాపరాధమే అన్న టాక్ కూడా ఉంది.మూడుసార్లు వరుస ఓటములతో ఆమె పూర్తిగా నిస్తేజంలో కూరుకుపోయారు. మరోపక్క అనారోగ్యం ముసురుకొంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో తన కుమార్తె గ్రీష్మను రాజకీయంగా ముందుకు తీసుకువచ్చారు. అయితే, అంతర్గత వివాదాలు పెరిగిపోవడం, పోయి పోయి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుతోనే వివాదాలు పెట్టుకోవడంతో ఈ ప్రయత్నం బెడిసి కొట్టింది. దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ కుటుంబానికి చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు సరికదా నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు. ఇక, ఇప్పుడు ఈ కుటుంబం నుంచి రాజకీయాల పై ఆలోచన చేసే వారే కనుమరుగయ్యారు. ప్రస్తుతం రాజకీయ వైరాగ్యంతో ఉన్న కావలి ప్రతిభా భారతి ఇంటికే పరిమితమయ్యారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.