యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ.. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ వ్యూహం మార్చుకున్నారా? ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారా ? ప‌్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. ఎన్నికలు వచ్చేందుకు ఎంత లేదన్నా నాలుగున్నరేళ్ల సమయం ఉంది. ఆ సమయానికి చంద్రబాబు వయసు 70 ప్లస్‌కు చేరిపోవడం ఖాయం. ఈ క్రమంలో పార్టీ పగ్గాలను ఎట్టి పరిస్థితిలోనూ వేరేవారికి అప్పగించి తాను పక్కన కూర్చోవాల్సిన అవసరం ఉంది.అయితే, అతిపెద్ద పార్టీ, ముఖ్యంగా మాస్ ఇమేజ్ ఎక్కువగా ఉన్న పార్టీటీడీపీని ముందుకు నడిపించేందుకు ప్రభుత్వం లోకి తెచ్చేందుకు కూడా అదే స్థాయిలో మాస్ ఇమేజ్, క్లాస్ పాలిటిక్స్ చేయగల నాయకుడు అవసరం. అలాగని ఇవన్నీ ఉన్న బయటి వారికి పార్టీ పగ్గాలను ఎలాగూ అప్పగించే ఛాన్స్ లేదు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లోగానే తన కుమారుడు ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నారా లోకేష్‌కు టార్గెట్ విధించారు. “నువ్వు ఏమైనా చెయ్యి. ప్రజల్లో ఇమేజ్ సొంతం చేసుకో. ప్రజలకు దగ్గరగా ఉండు. నా తర్వాత నువ్వే అనేలా ప్రజల నుంచే పిలుపు రావాలి. వారి ఆశీర్వాదం పొందాలి“ అని దిశానిర్దేశం చేశారట.దీంతో నారా లోకేష్ ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఓటమి బాధ నుంచి స్వల్ప కాలంలోనే బయట పడి.. ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆయన తరచుగా తాను ఓడిపోయిన నియోజకవర్గం మంగళగిరిలో పర్యటిస్తున్నారు. మంగళగిరిలో ఓటమి తర్వాత నారా లోకేష్ ఇక్కడ పోటీ చేయరన్న ప్రచారం కూడా జరిగింది. అయితే నారా లోకేష్ మాత్రం మళ్లీ తాను ఇక్కడే పోటీ చేసి గెలిస్తేనే మజా ఉంటుందని ప్రకటన చేశారు.మంగళగిరిలో పర్యటిస్తుండడంతో పాటు… అదే సమయంలో ప్రజల సమస్యలపైనా స్పందిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా నారా లోకేష్ ట్వీట్లు చేస్తున్నారు. ఇటు మాస్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూ.. క్లాస్ రాజకీయాలకు కూడా దగ్గరగా ఉంటున్నారు. ఇక, తన ప్రసంగాలను కూడా పదును పెట్టుకునేందుకు నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇక కార్యకర్తలకు దగ్గరయ్యేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలు ఎంపిక చేసుకుని సైకిల్ యాత్రకు సైతం రెడీ అవుతుండడం విశేషం. మొత్తానికి నారా లోకేష్ దూకుడు పెంచారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.