యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 19866 సీట్లు మిగిలిపోయాయి. రెండో దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. రెండో దశలో 12,726 మందికి సీట్లు కేటాయించామని అడ్మిషన్ల కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఈసారి ఎమ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీం పరీక్షలో 1,02,348 మంది అర్హత సాధించారు. అందులో 58,150 మంది మాత్రమే సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరయ్యారు. రెండోదశలో అదనంగా మరో 4222 మంది హాజరయ్యారు. వీరిలో 36,697 మంది తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేశారు. కన్వీనర్ కోటాలో 69,410 సీట్లు ఉండగా, అందులో తొలి దశలో 36818 సీట్లు భర్తీ కాగా, తొలి దశలో 32,592 సీట్లు మిగిలిపోయాయి. రెండో దశలో మరో 12726 సీట్లు భర్తీ కాగా ఇంకా 19866 సీట్లు మిగిలిపోయాయి. 14 యూనివర్శిటీ కాలేజీల్లో 3071 సీట్లకు 3055, 169 ప్రైవేటు కాలేజీల్లో 62473 సీట్లకు 46353 సీట్లు భర్తీ అయ్యాయి. ఇక బి ఫార్మసీలో మూడు యూనివర్శిటీ కాలేజీల్లో 80 సీట్లకు 24, 114 ప్రైవేటు కాలేజీల్లో 3251 సీట్లకు 86 భర్తీ అయ్యాయి. ఫార్మా డీ ఆఫర్ చేస్తున్న 54 కాలేజీల్లో 535 సీట్లకు 25 భర్తీ కాగా, 509 సీట్లు మిగిలిపోయాయి. వంద శాతం సీట్లు 44 కాలేజీల్లో భర్తీ కాగా, సున్నా అడ్మిషన్లు మూడు కాలేజీల్లో జరిగాయి.