యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించిన విషయం విదితమే. హెడ్ కోచ్‌తోపాటు బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ సహా పలు ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది నియామకానికి కూడా బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే టీమిండియా హెడ్ కోచ్ పదవికి ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితోపాటు శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్దనే, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ, భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌లు దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తుండగా, ఈ పదవికి మొత్తం 2వేల దరఖాస్తులు వచ్చాయని సమాచారం. ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో కథనం ప్రచురించారు. టీమిండియా హెడ్‌కోచ్ పదవికి టామ్ మూడీతోపాటు న్యూజిలాండ్ మాజీ, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ప్రస్తుత కోచ్ మైక్ హెస్సన్ కూడా దరఖాస్తు చేసుకున్నాడని తెలుస్తోంది. అలాగే భారత మాజీ క్రికెటర్లు రాబిన్‌సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు కూడా ఇటీవలే ఈ పదవికి దరఖాస్తు చేశారు. అయితే టీమిండియా కోచ్ పదవిపై గతంలో మహేల జయవర్దనే ఆసక్తిగా ఉన్నా అతను ఇప్పటికీ పదవికి దరఖాస్తు చేయలేదు. ఇక ఈ పదవి కోసం పలువురు విదేశీ క్రికెటర్లు ఇప్పటికే బీసీసీఐకి అప్లికేషన్లను పంపారని, వాటన్నింటినీ బీసీసీఐ పరిశీలిస్తున్నదని తెలిసింది. కాగా టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ జాంటీ రోడ్స్ దరఖాస్తు చేసుకోగా, ప్రస్తుతం కోచ్‌లుగా పనిచేస్తున్న వారితోపాటు ఇతర సిబ్బందిని కూడా బీసీసీఐ విండీస్ టూర్ ముగిసేవరకు కొనసాగించనుంది. ఇక కొత్తగా ఏర్పాటైన క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ) కో మెంబర్ అన్షుమన్ గైక్వాడ్ నేతృత్వంలో టీమిండియా కొత్త కోచ్, ఇతర సిబ్బందిని త్వరలో ఎంపిక చేయనున్నారు.