YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎన్టీఆర్‌ తర్వాత మోహన్‌బాబు గుర్తొస్తారు

ఎన్టీఆర్‌ తర్వాత మోహన్‌బాబు గుర్తొస్తారు

కాకతీయ కళా వైభవ మహోత్సవంలో మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు
'పెద్ద నటులనే కాదు మారుమూల ప్రాంతాల్లోని పేద కళాకారులను సైతం గుర్తించి సన్మానం చేయాలని సుబ్బరామిరెడ్డిని కోరుకుంటున్నాను. అందుకోసం ఆయన 120 ఏండ్లు జీవించి ఉండాలి' అని మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు అన్నారు. కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి బుధవారం హైదరాబాద్‌లో 'కాకతీయ కళా వైభవ మహోత్సవం' పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడిగా 42 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోహన్‌బాబును 'విశ్వ నట సార్వభౌమ' బిరుదుతో సత్కరించారు. 
ఈ వేడుకకు అతిథిగా విచ్చేసిన విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, 'పదునైన పదజాలాన్ని పలకడంలో తనకు తానేసాటి అని నిరూపించుకున్న ఎన్టీఆర్‌ తర్వాత గుర్తుకు వచ్చే వ్యక్తి మోహన్‌బాబు. ఓ మంచి బిరుదుతో మోహన్‌బాబును సత్కరించడం ఆనందంగా ఉంది. తెలుగు భాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఓ వెబ్‌ సైట్‌ను తీసుకురావాలి' అని అన్నారు. 'మోహన్‌బాబు అద్భుతమైన నటుడు. ఐదుతరాల ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న ఆయన 'విశ్వ నట సార్వభౌమ' అవార్డుకు సంపూర్ణ అర్హులు' అని స్పీకర్‌ మధుసూదనా చారి తెలిపారు. 
మోహన్‌బాబు చెబుతూ, 'విద్యా సాగర్‌రావు నా ఆత్మీయులు. ఓరుగల్లు అంటే వరంగల్‌. పౌరుషాల గడ్డ. ఆ ప్రాంతం గురించి నాకు పెద్దగా తెలియదు గాని, కులమతాలకు అతీతంగా తెలుగు వారంతా కలసి మెలసి ఉండాలని పోరాడిన వీర వనిత రుద్రమదేవి గురించి తెలుసు. డబ్బున్న వాళ్ళు ఎందరో ఉంటారు. అందరికీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన రాదు. పూర్వం రాజులు చేసేవారు. ఇప్పుడు సుబ్బరామిరెడ్డి చేస్తున్నారు. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని నేనీస్థాయికి వచ్చా. భక్త వత్సలం నాయుడు అయిన నన్ను గురువుగారు దాసరి మోహన్‌బాబుగా మార్చారు. 1982లో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌ స్థాపించి అన్నగారు ఎన్టీఆర్‌తో కొబ్బరికాయ కొట్టించాను.1992లో నా ఆస్తులు తాకట్టుపెట్టి 'మేజర్‌ చంద్రకాంత్‌' సినిమా తీస్తే అది సిల్వర్‌ జుబ్లీ హిట్‌ అయ్యింది. మళ్ళీ అన్నగారు సీఎం అయ్యారు. ఆ మహానుభావుడు నన్ను రాజ్యసభకు పంపారు. అందరికీ కోపం ఉంటుంది. కానీ నాకు ఎక్కువగా ఉంటుంది. తన కోపమే తన శత్రువు అన్నట్టు నాకోపం నాకు నష్టాన్ని కలిగించిందే తప్ప ఎవరికీ నష్టం కలిగించలేదు. మద్రాసులో పనిచేసే రోజుల్లో ఓ కారు షెడ్డులో ఉండేవాడిని. తినడానికి తిండిలేక ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచించి ఓ కో-డైరెక్టర్‌ ఇంటికి వెళ్లాను. నేను వచ్చానని అతను తన భార్యను ఉప్మా చేయమని స్నానానికి వెళ్లాడు. తను వచ్చేలోపు పుస్తకం చదువుదామని తీస్తే అందులో ఉన్న ఎర్రతేలు కుట్టింది. నా 42 ఏండ్ల ప్రస్థానంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిపై ఓ పుస్తకం రాస్తున్నాను' అని చెప్పారు. 'ఇప్పటికీ లలిత కళలు బతికే ఉన్నాయంటే సుబ్బరామిరెడ్డి వారి వల్లే. 'కాకతీయ కళా పరిషత్‌' స్థాపించి, తొలిసారి మోహన్‌బాబుని సత్కరించుకోవడం మా చలన చిత్ర రంగాన్ని సన్మానించడంగా భావిస్తున్నాను' అని బాలకృష్ణ తెలిపారు.
బ్రహ్మానందం చెబుతూ, 'ఏ నుంచి జెడ్‌ వరకూ మోహన్‌బాబు అభిమానులే' అని చెప్పారు. ఈ సందర్భంగా నటుడు టి.ఎల్‌.కాంతారావు కుటుంబానికి సుబ్బరామిరెడ్డి రూ.5లక్షల ఆర్థిక సాయం అందించారు. అలాగే పలువురు కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బి.గోపాల్‌, మంచు విష్ణు, మనోజ్‌ ,అలీ, కోటి, జయప్రద, జయసుధ, మంచు లక్ష్మి, శ్రియా, ప్రగ్యా జైస్వాల్‌, స్వామిగౌడ్‌తోపాటు పలువురు రాజకీయ నాయకులు సుబ్బరామిరెడ్డి కళా సేవలను కొనియాడారు.

 

Related Posts