రాజకీయాల్లో అవునంటే కాదనులే అన్న మాట ఎపుడూ నిజమవుతుంది. నాకు పదవులపై వ్యామోహం లేదు అన్న వారే అందలాలను ఎక్కుతూ ఉంటారు. అదేం చిత్రమో పదవులు కూడా వారినే వరిస్తూంటాయి. ఇక పొలిటికల్ కెరీర్ క్లోజ్ అనుకుంటూ తట్టా బుట్టా పట్టుకుని హైదరాబాద్ వచ్చేద్దామనుకుంటున్న పీవీ నరసింహారావుని అధికార లక్ష్మి అలానే ప్రధానిని చేసింది . అందువల్ల వద్దు అని ఎంత అనుకుంటే అంత కావాలని అర్ధం. ఇదంతా ఎందుకంటే జనసేనాని పవన్ కళ్యాణ్ తనకు పదవుల మీద, అధికారం మీద వ్యామోహం లేదని అంటున్నారు. కాకినాడ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. తనకు కావాలనుకుంటే కేంద్ర మంత్రి పదవి ఎపుడో వచ్చేదని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది సరే అనుకున్నా పవన్ కళ్యాణ్ ఎన్నికలలోనూ, అంతకు ముందు చేసిన ప్రసంగాలు చూస్తే అయన ముఖ్యమంత్రి కావాలని ఎంత బలంగా కోరుకున్నారో అర్ధమవుతుంది. సీఎం అని అరవడం కాదు, ఓటేసి నన్ను ముఖ్యమంత్రిని చేయండని ఆయనే అనేక సభల్లో ఫ్యాన్స్ కి పిలుపు ఇచ్చారు. నేనే కాబోయే సీఎం అని కూడా అయన అప్పట్లో చెప్పుకున్నారు.కేంద్ర మంత్రి పదవి అని ఇపుడు పవన్ కళ్యాణ్ నోట కొత్తగా వినిపిస్తోంది. అయిదేళ్ళ వరకూ ఏపీలో ఎన్నికలు లేవు. ముఖ్యమంత్రి పదవిలో జగన్ బాగానే కుదురుకున్నారు. ఇపుడున్న రాజకీయ వాతావరణంలో వైసీపీ, టీడీపీల మధ్యనే ఎన్నికల యుధ్ధం కేంద్రీకృతమై ఉంటుందన్నది పవన్ కళ్యాణ్ కి కూడా అర్ధమైందా అన్న డౌట్లు వస్తున్నాయి. అందుకేనా అయన కేంద్ర మంత్రి పదవి అంటున్నది అని కూడా సందేహం కలుగుతోంది. పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి ఎలా అవుతారు. ఆయన కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదే, పైగా ఆయన పార్టీకి పార్లమెంట్ లో ఎక్కడా ప్రాతినిధ్యం లేదే. సహజంగా ఈ ప్రశ్నలు వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ కూడా ట్రెడిషనల్ పొలిటీషియన్ గానే ఈ మాటలు అంటున్నారు కాబట్టే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చుననిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అన్న మాటల వెనక చాలా అర్ధాలు ఉన్నాయి కూడా. అందులో బీజేపీ పిలుస్తోంది అన్న సందేశం కూడా ఉంది.ఇక పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవడానికి బీజేపీలో ఎపుడూ అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఉన్న గ్లామర్ అలాంటిది. ఆయన సొంతంగా పార్టీ పెట్టి గెలవలేకపోవచ్చు. కానీ తన సినీ బలం, కుల బలంతో యూత్ ఫాలోయింగ్ తో మరో పార్టీని గెలిపించే స్థాయి ఆయనకు ఎపుడూ ఉంది. అందుకే బీజేపీ పవన్ కళ్యాణ్ కి గేలం వేస్తోంది, పవన్ అన్న మాటల వెనక ఉన్న కధ కూడా ఇదే. 2014 తరువాత అమిత్ షా జనసేనను బీజేపీలో విలీనం చేయమని కోరారని పవన్ కళ్యాణ్ తరచుగా చెబుతున్న మాటే. అప్పట్లో తాను విలీనం చేయను అని గట్టిగా చెప్పానని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ తాజా ఎన్నికల్లో జనంలోకి వెళ్లారు, తన బలం ఏంటో కూడా చూసుకున్నారు, ఇపుడు అమిత్ షా ఆఫర్ ఇస్తే వదులుకునేందుకు పవన్ కళ్యాణ్ సిధ్ధంగా లేరన్నది మాత్రం నిజం. జాతీయ పార్టీలు పిలుస్తున్నాయి అని పవన్ కళ్యాణ్ కూడా తాజాగా విలేకరుల సమావేశంలో చెప్పిన దాన్ని తలచుకుంటే కేంద్ర మంత్రిని అవుతాను అన్న దాన్ని కలుపుకుంటే పవన్ కళ్యాణ్ రాజకీయం ఇట్టే బోధపడుతుంది అయితే ఇక్కడో షరతు ఉంది. పవన్ కళ్యాణ్ తన జనసేనను బీజేపీలో విలీనం చేసి పూర్తి కాషాయధారిగా మారిపోతెనే ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కేది. బహుశా ఆ డైలామా నుంచే పవన్ నోటి వెంట అధికారం పై మోజు లేదు అన్న మాటలు వస్తున్నాయనుకోవాలి.