Highlights
- రాజీనామాలకు గవర్నర్ ఆమోదం
- సీఎం చంద్రబాబుకు అందిన సమాచారం!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్నబిజెపికి చెందిన కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావులు మాజీ అమాత్యులయ్యారు. గురువారం వారిరువురు చేసిన రాజీనామాలకు గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. కాగా, గురువారం ఉదయం సీఎం చంద్రబాబును కామినేని, మాణిక్యాలరావు కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని, దేవాదాయ శాఖ మంత్రిగా మాణిక్యాలరావు సమర్థంగా పనిచేశారని చంద్రబాబు ప్రశంసించడం విదితమే. ఇదిలా ఉండగా, కేంద్రంలోని టీడీపీ మంత్రులు సుజనా చౌదరీ, అశోక్ గజపతిరాజులు సమర్పించిన రాజీనామా లేఖలను ఆమోదించారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ రాజీనామాలను వారిరువురు స్పీకర్ ఫార్మేట్ లో చేయలేదన్న విషయం తెలిసింది. మరి ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. ఈ సాయంత్రం ప్రధాని మోడీతో నిర్బహించిన వీరి చర్చలు సఫలమైనట్టుగా లేవన్నది సమాచారం.