
శంషాబాద్ విమానాశ్రయంలో కిడ్నాప్ కలకలం రేగింది. క్యాబ్‌లో వెళ్తున్న ఇద్దరు యువతులతో పాటు ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు డ్రైవర్ యత్నించాడని బాధిత కుటుంబసభ్యులు శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబయి నుంచి శ్రీనాథ్ కుటుంబసభ్యులు ఇవాళ ఉదయం శంషాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి వెళ్లేందుకు శ్రీనాథ్ సొంత వాహనం సరిపోకపోవడంతో మరో క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. కొందరు సొంత కారులో ఎక్కగా.. క్యాబ్ కోసం ఇద్దరు యువతులు, ఒక బాలుడు అక్కడే నిరీక్షిస్తున్నారు. ఈ లోపు అటువైపుగా ఓ వాహనం వచ్చింది. అదే తాము బుక్ చేసిన క్యాబ్ అని వారంతా అందులోకి ఎక్కారు. ముందు వెళ్తున్న శ్రీనాథ్ కారును అనుసరించాలని కోరారు. మధ్యలో ఓటీపీ చెప్తామని యువతులు కోరినప్పటికీ.. ఆ డ్రైవర్ అలాంటిదేమీ అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మార్గమధ్యంలో డ్రైవర్ అతడి స్నేహితుడ్ని కూడా కారులో ఎక్కించుకున్నట్లు యువతులు చెబుతున్నారు. అనంతరం శ్రీనాథ్ కారుని వీరి వాహనం ఓవర్‌టేక్ చేసి వెళ్లింది. దీంతో భయాందోళనకు గురైన యువతులు ఫోన్ చేసి వెనుక వస్తున్న కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో కుటుంబసభ్యులు సదరు కారును వెంబడించి పట్టుకున్నారు. ఈ మేరకు శంషాబాద్ విమానాశ్రయంలో బాధిత కుటుంబం ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.