YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

కశ్మీర్ మధ్య వర్తిత్వానికి నో

కశ్మీర్ మధ్య వర్తిత్వానికి నో

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఇటీవల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అమెరికాలో పర్యటించినప్పుడు, అగ్రరాజ్యాధినేత కశ్మీర్ అంశంపై చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. కశ్మీర్ వివాదం పరిష్కారానికి అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని, ఈ విషయంలో భారత ప్రధాని మోదీ కూడా తన సహకారం కోరినట్టు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారమే రేగింది. ఈ అంశం పార్లమెంటును కుదిపేసింది. జపాన్‌లోని క్యోటోలో జరిగిన జీ-20 సదస్సులో మోదీ తనను కలిసి ఈ అంశంపై చర్చించినట్టు పాక్ ప్రధాని పక్కనుండగానే ట్రంప్ ప్రకటించి తేనెతుట్టె కదిపారు. ఆ ప్రకంపనలు ఇంకా చల్లారక ముందే ట్రంప్ మరోసారి కశ్మీర్ అంశంపై ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సమస్యపై భారత్, పాకిస్థాన్‌లు కూర్చుని మాట్లాడుకుని కలసికట్టుగా పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు సూచించారు. ఒకవేళ తన సహకారం కావాలని ఇరు దేశాలు కోరితే, మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, తన ఆఫర్‌ను అంగీకరించడమా? తిరస్కరించడమా? అనేది మోదీపైనే ఆధారపడి ఉందని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. భారత్, పాక్ ప్రధానులు మంచి వ్యక్తులని... వారిద్దరూ కలసి అద్భుతమైన ప్రగతిని సాధిస్తారనే నమ్మకం తనకుందని పేర్కొన్నారు. ఎలాంటి సహకారమైనా కావాలని వారు కోరుకుంటే, దానిని అందజేయడానికి తాను సిద్ధమని... ఇదే విషయాన్ని ఇమ్రాన్ ఖాన్‌తో ఖరాఖండిగా చెప్పినట్టు తెలిపారు. వారిద్దరూ తన మధ్యవర్తిత్వాన్ని కోరితే... తప్పకుండా కశ్మీర్ అంశంలో జోక్యంచేసుకుంటానని ట్రంప్ ఉద్ఘాటించారు. కశ్మీర్ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోందని అన్నారు. కాగా, కశ్మీర్ అంశంలో ట్రంప్ చేసిన ఆఫర్‌ను భారత్ శుక్రవారం తిరస్కరించడం విశేషం. ఇది కేవలం భారత్, పాక్ మధ్య ఉన్న ద్వైపాక్షిక అంశమని పేర్కొంది. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోకి భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. బ్యాంకాక్ వేదికగా జరుగుతోన్న తూర్పు ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల తొమ్మిదో సదస్సులో మైక్ పాంపియోను కలిసిన కేంద్ర మంత్రి జయశంకర్.. కశ్మీర్ అంశంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. జీ-20 సమ్మిట్‌లో కశ్మీర్ విషయంలో కలగజేసుకోవాలని మోదీ తనను కోరినట్టు ట్రంప్ వ్యాఖ్యానించడంతో దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు నిలదీశాయి. లోక్‌సభ నుంచి కూడా వాకౌట్ చేశాయి. ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి జయశంకర్ లోక్ సభలో వివరణ ఇచ్చారు. మోదీ, ట్రంప్‌లు చర్చిస్తున్నప్పుడు తాను పక్కనే ఉన్నానని... ప్రధాని అలాంటి ప్రతిపాదన చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

Related Posts