YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

సంచలనాల మోత

సంచలనాల మోత

వావ్రింకా, ముగురుజా, కొంటా అవుట్‌
- వేడి కుంపట్లో జకోవిచ్‌, మోన్‌ఫిల్స్‌ పోరు
- ఫెడరర్‌, షరపోవా, కెర్బర్‌ ముందంజ
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నాల్గో రోజు సంచనాల మోత మోగింది. ఒక వైపు అధిక ఉష్గోగ్రతలు, మరో వైపు షాకింగ్‌ ఫలితాలతో మెల్‌బోర్న్‌ వేడెక్కింది!. స్టార్‌ ప్లేయర్‌ స్టాన్‌ వావ్రింకా గత పదేండ్లలో తొలిసారి మూడోరౌండ్‌కు ముందే నిష్క్రమించగా, వింబుల్డన్‌ మాజీ చాంప్‌ ముగురుజా, బ్రిటన్‌ భామ జోహన్న కొంటాలు రెండో రౌండ్‌ నుంచే ఇంటిముఖం పట్టారు. రేసుగుర్రం రోజర్‌ ఫెడరర్‌ అలవోకగా మూడోరౌండ్లో అడుగుపెట్టగా.. షరపోవా, కెర్బర్‌ అదే దారిలో నడిచారు. 

తొలి మూడు రోజులు సాదాసీదాగా సాగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నాల్గో రోజు ఒక్కసారిగా సంచనాలకు వేదికైంది. స్టార్‌ ఆటగాళ్లు ఊహించని రీతిలో రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. స్విస్‌ స్టార్‌ ఆటగాడు, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మాజీ విజేత స్టానిస్లాస్‌ వావ్రింకా వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. అమెరికా ఆటగాడు వావ్రింవాకు చెక్‌ పెట్టాడు. ఇక ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు మించిపోయిన కోర్టు వాతావరణంలో నొవాక్‌ జకోవిచ్‌, గొఫిన్‌ మోన్‌ఫీల్స్‌ ఢకొీన్నారు. ఈ మ్యాచ్‌కు నాల్గో రోజు ఆటకే హైలైట్‌గా నిలిచింది. మహిళల విభాగంలో ఇద్దరు స్టార్‌ ప్లేయర్స్‌ నిష్క్రమించారు. బ్రిటన్‌ స్టార్‌ జొహన్న కొంటా, గార్బినె ముగురుజాలు మూడో రౌండ్‌కైనా చేరకముందే ఓటమిపాలయ్యారు. 
ఫెడరర్‌ జోరు : ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో స్విస్‌ యోధుడు రోజర్‌ ఫెడరర్‌ది ప్రత్యేక అధ్యాయం. ఇక్కడ మూడో రౌండ్‌కు ముందు అతడు ఒక్కసారి కూడా నిష్క్రమించలేదు. ఈ సారీ రోజర్‌ ఆ ఒరవడి కొనసాగించాడు. 6-4, 6-4, 7-6(7-4)తో జర్మనీ ఆటగాడు స్ట్రఫ్‌పై గెలుపొందాడు. రెండు గంటల ఆటలో రోజర్‌ ఏమాత్రం ఇబ్బంది పడకుండా మూడోరౌండ్‌లోకి ప్రవేశించాడు. కానీ సహచర ఆటగాడు వావ్రింకా మాత్రం ఇంటిముఖం పట్టాడు. 6-2, 6-1, 6-4తో టెన్నిస్‌ సాండిగెన్‌ (అమెరికా) చేతిలో వావ్రింకా ఓటమిపాలయ్యాడు. ఇక సుమారు మూడు గంటల పాటు సాగిన జకోవిచ్‌, మోన్‌ఫీల్స్‌ పోరులో సెర్బియా చిన్నోడు గెలుపొందాడు. 4-6, 6-3, 6-1, 6-3తో మోన్‌ఫీల్స్‌ను జకోవిచ్‌ మట్టికరిపించాడు. మోన్‌ఫీల్స్‌పై జకోకు ఇది ఏకంగా 15వ వరుస విజయం. ఓపెన్‌ శకంలో ఓ ఆటగాడిపై ఇంత ఘనమైన రికార్డు జకోవిచ్‌కు తప్ప మరోకరికి లేదు. థామస్‌ బెర్డిచ్‌ 6-3, 2-6, 6-2, 6-3తో స్పయిన్‌ ఆటగాడు గార్సియా లోపెజ్‌ను ఓడించి మూడో రౌండ్లోకి చేరుకున్నాడు. 
ఇద్దరు స్టార్స్‌ ఇంటికి : మహిళల సింగిల్స్‌ విభాగంలో ఇద్దరు స్టార్‌ ప్లేయర్స్‌ ఓటమిపాలయ్యారు. గార్బినె ముగురుజా 6-7(1-7), 4-6తో చైనీస్‌ తైపీ అమ్మాయి చేతిలో చిత్తుగా ఓడింది. సు వీ వరుస సెట్లలో ముగరుజాపై విజయం సాధించింది. బ్రిటన్‌ భామ జొహన్న కొంటా 4-6, 5-7తో బెర్నార్డ పెరా (అమెరికా) చేతిలో వరుస సెట్లలో భంగపడింది. రష్యా స్టార్‌ మరియా షరపోవా మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. 6-1, 7-6(7-4)తో అనస్థాసియా సివాస్టోవా (లాత్వివా)పై వరుస సెట్లలో గెలుపొందింది. ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ) 6-4, 6-1తో రెండోరౌండ్లో అలవోక విజయం సాధించింది. మడిసన్‌ కీస్‌ (అమెరికా) 6-0, 6-1తో ఎకర్తినా అలెగ్జాండ్రియా (రష్యా)పై పైచేయి సాధించింది. టాప్‌ సీడ్‌ సిమోన హలెప్‌ 6-2, 6-2తో బౌచర్డ్‌పై గెలుపొంది మూడోరౌండ్లో కాలుమోపింది.

Related Posts