యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
చేపపిల్లల సీజన్ వచ్చేసింది. ముసుర్లు పడుతుండటంతో మత్స్యశాఖ చేపపిల్లలను చెరువులు, రిజర్వాయర్లు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది 80.68 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది లక్ష్యం రెట్టింపైయింది. కొత్తగా కాళ్లేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లలో చేపపిల్లలను వదిలేందుకు బేస్‌లైన్ సర్వేను పూర్తి చేసింది. రాష్ట్రంలో చేపల పెంపకానికి అనుకూలంగా 24వేల చెరువులు ఉన్నాయి. ఇవేకాకుండా రిజర్వాయర్లులోనూ వదులుతారు. 34 శాతం నీరు చేరితేనే చేపపిల్లలను వేస్తారు. ఆశించిన స్థాయిలో వానలు పడి పుష్కలంగా నీరు వస్తే ఆగస్టు మూడోవారంలో చేపపిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ సిద్ధమవుతున్నది. వందశాతం రాయితీతో చేపల పిల్లలను అందిస్తున్నది. 2015లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఈ నాలుగేండ్లలో రూ 117 కోట్లు ఖర్చు చేసింది. ఈ సంవత్సరానికి 80.68 కోట్ల చేపపిల్లల కోసం సుమారు రూ 70 కోట్లు కేటాయించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. చేప పిల్లలను వదిలే ముందు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల నుంచి సమాచారం తెప్పించుకుని, వాటి ఆధారంగా చేపపిల్లలు వేస్తారు. చేపపిల్లల కొనుగోలు నిమిత్తం ఒకటి, రెండు జిల్లాలు మినహా టెండర్ల ప్రక్రియ పూర్తయింది. జిల్లాల వారీగా టెండర్లు ఆహ్వానిస్తారు. 35 మిల్లీ మీటర్ల నుంచి 40 మిల్లీమీటర్ల సైజ్‌లో చేపపిల్లలకు అర్థరూపాయి, 82 మిల్లీమీటర్ల నుంచి 100 మిల్లీమీటర్ల సైజ్ ఉన్న వాటికి రూపాయి పది పైసల చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందులో పది పైసలు తక్కువ కోడ్ చేసినా టెండర్ దక్కే అవకాశం ఉంది. నిర్ణీత ధర కంటే ఎక్కువ కోడ్ చేసినా ఇవ్వాలనే నిబంధన పెట్టింది. ఇందులో 40 శాతం చేపల దిగుమతి ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి, మిగతాది తెలంగాణ రాష్ట్రం నుంచి కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. రాష్ట్ర వాతావరణ పరిస్థితులు, నీటిలో ఉన్న పోషకాహార లభ్యత కారణంగా నాలుగు రకాల చేపపిల్లలను వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బొచ్చ, రోహు, మ్రిగాలా, బంగారుతీగ వంటి రకాల చేప పిల్లలను వదులుతారు. ఆరు మాసాల్లో 300 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు పెరుగుతాయి. ఏడాదిలో ఒక కేజీ, రెండేండ్లలో 2 లేదా 3 కేజీల బరువు పెరుగుతాయి. చెరువుల్లో లభ్యమయ్యే నాచు, ఇతర పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి.రాష్ట్రంలో 4,400 మత్య్స పారిశ్రామిక సహకార సంఘాలున్నాయి. అందులో 400 ప్రత్యేకంగా మహిళా సంఘాలున్నాయి. మొత్తం కలిపి మూడు లక్షల 17వేల మంది సభ్యులు ఉన్నారు. 20వేల మంది మహిళా సభ్యులు ఉన్నారు. చెరువుల విస్తీర్ణాన్ని బట్టి చేపపిల్లలను వేస్తారు. ఆయా గ్రామాల పరిధిలో ఉన్న చెరువుల్లో ఆ గ్రామ సంఘాల సభ్యులు చేపలు పట్టి అమ్ముకుంటారు. ఈ నాలుగేండ్లలో సహకార సంఘాల సంఖ్య బాగా పెరిగింది. కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్‌లో 1.30 కోట్ల చేపపిల్లలు వేయాలని నిర్ణయించింది. మూడు నెలల క్రితమే నీటి లభ్యత, సామర్థ్యం, విస్తీర్ణం తదితర అంశాలపై బేస్‌లైన్ సర్వే నిర్వహించింది. భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో చేపల పెంపకానికి అనువుగా ఉన్నట్టు భావిస్తున్నది. ఎన్ని గ్రామాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఎన్ని మత్య్స సహకార సంఘాలున్నాయనే లెక్కలు తీసింది. వీటితోపాటు పోచంపాడు, లోయర్‌మానేరు, మెదక్, వైరా, మంజీరా, కోయిల్‌సాగర్, చంద్రసాగర్, వికారాబాద్, డిండి వంటి రిజర్వాయర్లలో చేప పిల్లలు వదిలే విషయం తెలిసిందే. నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల్లో ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన మత్స్యశాఖల ఆధ్వర్యంలో చేపపిల్లలను వదులుతారు.