కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ముంబై మహానగరం అతలాకుతలం అవుతోంది. నగర శివారు ప్రజలు ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. సముద్రతీర ప్రాంతాల్లో 4.90 మీ. ఎత్తులో అధిక ఆటుపోట్లతో అలలు ఎగిసిపడుతుండటంతో తీర ప్రాంతాలవైపు వెళ్లకూడదని వాతావరణ శాఖ సూచించింది. 48 గంటల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.ఇక ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రైల్వే, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంజయ్ గాంధీ జాతీయ పార్కులో వరద నీరు చేరడంతో సందర్శన నిలిపివేశారు. ముంబై-గోవా హైవే పై రాకపోకలు ఆగిపోయాయి. భారీ వర్షాల కారణంగా సముద్ర తీర ప్రాంత రహదారులపై చెత్త కొట్టుకు రావడంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది.. దానిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.