జమ్మూకశ్మీర్ లో అమర్ నాథ్ యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారంటూ ఆర్మీ వెల్లడించిన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దంటూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సూచించారు. అమర్ నాథ్ యాత్రను అర్ధంతరంగా నిలిపివేయడం పట్ల విమర్శలు వస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిన్న కశ్మీర్లో ఓ స్నైపర్ రైఫిల్ దొరికిన నేపథ్యంలో, ఉగ్రవాదులు అమర్ నాథ్ యాత్రను భగ్నం చేయడానికి భారీ కుట్ర పన్నారంటూ ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ ఆర్మీ సంచలన సమాచారం పంచుకుంది. కశ్మీర్ లోయలో ఉగ్రదాడులు జరగొచ్చని హెచ్చరించింది. దాంతో కేంద్రం వెంటనే స్పందించి 35,000 మంది భద్రతా బలగాలను కశ్మీర్ తరలించింది. ఓవైపు యాత్రికులు వెంటనే కశ్మీర్ నుంచి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో ఏంజరుగుతుందో తెలియక భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గవర్నర్ సత్యపాల్ మాలిక్ తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. బలగాల మోహరింపుపై ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ప్రధానంగా, పూంచ్-రాజౌరీ సెక్టార్లో బలగాలు మోహరించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తుండడంపై ఆయన స్పందించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. మరోవైపు ప్రజలు తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్, నిత్యావసరాలను ముందే నిల్వ చేసుకుంటున్నారు.