మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. మన్మోహన్ సింగ్ లాంటి అనుభవజ్ఞులు రాజ్యసభలో ఉండటం ముఖ్యమని భావించిన కాంగ్రెస్ ఆయన్ను పెద్దల సభలో కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మన్మోహన్ సింగ్ పదవీకాలం జూన్- 14న ముగిసిన విషయం తెలిసిందేఈసారి రాజస్థాన్ నుంచి మన్మోహన్ ను రాజ్యసభకు పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదేగనుక జరిగితే ఆయన నాలుగోసారి రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహించిన వారవుతారు. ఇందులో రెండు సార్లు దేశ ప్రధానిగా ఉన్నారు.ఈనెల 26న రెండు రాజ్యసభ స్థానాలకు జరుగనున్న ఉపఎన్నికలను ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందులో ఒకటి రాజస్థాన్ నుంచి కాగా, మరొకటి ఉత్తరప్రదేశ్. బీజేపీ ఎంపీ మదన్ లాల్ సైనీ గత జూన్‌లో కన్నుమూయడంతో రాజస్తాన్ సీటు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఎస్పీ ఎంపీ నీరజ్ శేఖర్ గత జూలైలో పార్టీ మారి బీజేపీలో చేరడం, రాజ్యసభ సీటుకు రాజీనామా చేయడంతో యూపీలో రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా 1991 నుంచి సుధీర్ఘంగా కొనసాగుతూ వచ్చారు. గతంలో ఆయన అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు. 2004-14వరకు పదేళ్లపాటు ప్రధానిగా ఉన్న సయమంలో కూడా రాజ్యసభ నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు.