Highlights
- ఫెడరల్ ఫ్రెంట్ దిశగా అడుగులు
- ఫలిస్తున్న కేసీఆర్ వ్యూహాం
- దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఉనికేది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కేంద్రంలోని యన్డీయే ప్రభుత్వం ఏ ధైర్యంతో ప్రకటన చేసిందో,,అదే ధైర్యం ఇప్పుడు కేంద్ర పాలిట శాపం కానుందా.. ప్రాంతీయ పార్టీల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీకి అదే పార్టీకి చెందిన కీలక నేతలతో బుద్ధి చెప్పబోతున్నారా.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతే ఎన్డీయేకు గడ్డుకాలమేనా..అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి అంత పట్టు లేదు.
కాకపోతే వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిన కూడా పాగా వేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా ఏపీ,తెలంగాణలో ఎలాగైనా అధికంగా సీట్లు సాధించాలని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ.అందుకు తగ్గట్లుగానే ఏపీలో చంద్రబాబును,తెలంగాణలోనూ కేసిఆర్ ను దువ్వుకుంటూ వస్తోంది మోదీ సర్కార్.కానీ గత వారం రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ఇటు టీడీపీని,అటు టీఆర్ఎస్ ను ఇరకాటంలో పడేసి బీజేపీకి ఎక్కువ టికెట్లు దక్కించుకోవాలని చూసింది.పొత్తు అలాగే కొనసాగితే నయానో,భయానో బీజేపీకి ఎక్కువ టికెట్లు డిమాండ్ చేసేలా కసరత్తులు చేసింది.కానీ ప్రత్యేకహోదాకు కేంద్రం తలొగ్గకపోవడం,తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటంతో టీడీపీ,టీఆర్ఎస్ లు కలిసిపోయి బీజేపీపై విరుచుకుపడుతున్నాయి.
అంతేకాదు, రాష్ట్రాలపై పెత్తనం చలాయించేందుకే పెద్దదిక్కుగా ఉన్న వెంకయ్య నాయుడిని తప్పించారన్న వార్తను మళ్లీ మొదటికి తెచ్చే ప్రయత్నం తెరవెనక జరుగుతోంది. వెంకయ్యను ముందుకు తీసుకొచ్చి రాష్ట్రాలకు రావాల్సిన హామీలను దక్కించుకునేలా వ్యూహాలు రచించాలని భావిస్తున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు. అందులో భాగంగానే కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ ప్రకటన చేశారని, ఫెడరల్ ఫ్రంట్ ను రాబోయే కాలంలో నడిపించబోయేది వెంకయ్య నాయుడే అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక లోలోపల మథన పడుతున్న వెంకయ్య నాయుడితో ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయించాలని చంద్రబాబు,కేసీఆర్ లు ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజీనామా అనంతరం ఫెడరల్ ఫ్రంట్ కు పెద్దన్న పాత్ర పోషిస్తారని, ఆ కూటమికి ప్రధాని అభ్యర్థిగా వెంకయ్యే ఉంటారన్న వార్తలు వస్తున్నాయి.
అవకాశం ఎవరికైనా ఒకేసారి వస్తుంది..దాన్ని వినియోగించుకున్న వాళ్లే గొప్పవాళ్లు అవుతారు.లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు.ఇప్పుడిదే కోవకు సంబంధించిన వారిలో వెంకయ్య నాయుడు ఒకరు. దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న తనను తప్పించి,ఇష్టం లేకపోయినప్పటికీ పార్టీపై ఉన్న గౌరవంతో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి ఉపరాష్ట్రపతి సీట్లో కూర్చున్నాడు. తద్వారా కీలక పదవిలో ఉన్నాడన్న పేరే తప్పా, వెంకయ్య నాయుడికి ఉన్న అధికారమంటూ ఏదీ లేదు.అందుకే వెంకయ్యను ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయించి మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో భాగం చేసుకోవాలని చంద్రబాబు,కేసీఆర్ లు భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెంకయ్య నాయుడి అభిమానులు ఉన్నారు.ఆర్ఎస్సెస్ లో పనిచేసి బీజేపీలో కొనసాగుతున్న వారిలో చాలామంది వెంకయ్య నాయుడిని అమితంగా అభిమానిస్తారు. వారంతా వెంకయ్య నాయుడు ఒక్క మాట చెప్తే దాన్ని శిరసావహించేందుకు వెనకడారు.ఇకపోతే ప్రాంతీయ పార్టీలతో ఆయనకున్న అనుబంధం అంతా ఇంతా కాదు. ఇప్పటికే అకాలీదళ్,శివసేన వంటి పార్టీలు బీజేపీకి దూరమయ్యాయి.ఇక టీడీపీ కూడా రేపోమాపో కటీఫ్ చెప్పనుంది.దీంతో బీజేపీ బలం క్రమంగా తగ్గనుంది. ఏవైతే దూరమయ్యాయో,అవుతున్నాయో ఆ పార్టీలన్నింటినీ కలుపుకుని ఓ ఫ్రంట్ ను ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా ఎన్డీయే,యూపీఏ లకు ధీటుగా దేశ రాజకీయాల్లో కీలకం అవ్వాలని చంద్రబాబు,కేసీఆర్ లు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.అందులో భాగంగానే వెంకయ్య నాయుడుతో రాయబారాలు నడుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ రాయబారాలు ఫలిస్తే ఫెడరల్ ఫ్రంట్ కు పెద్దదిక్కు వెంకయ్య నాయుడే కానున్నారని సమాచారం.ఒకవేళ ప్రధాని అభ్యర్థిగా వెంకయ్య అవునో కాదో అన్నది పక్కనపెట్టినా, ఫెడరల్ ఫ్రంట్ కు దిశానిర్ధేశలు చేసే బాధ్యతలు మాత్రం ఆయనే స్వీకరిస్తాడని అంటున్నారు నిపుణులు.మొత్తానికి వెంకయ్య నాయుడితో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయిస్తారన్న ప్రచారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.