యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
బోండా ఉమామహేశ్వరరావు. తెలుగుదేశం పార్టీకి గొంతుకగాపేరు. విజయవాడ కేంద్రంగా రాజకీయాలు చేసిన బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో మంచి గుర్తింపు పొందారు. 2014 ఎన్నికల్లో తొలిసారి బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో కీలకంగా మారారు. ముఖ్యంగా జగన్ ను విమర్శించడంలో ఆయన ముందుంటారు.సబ్జెక్ట్ మీద అవగాహన, మంచి వాగ్దాటి, జగన్ ను, ఆయన పార్టీపై విరుచుకు పడుతుండటంతో బోండా ఉమామహేశ్వరరావు అనతి కాలంలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టిలో పడ్డారు. బోండా ఉమకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. రాజధాని కూడా విజయవాడ నగరానికి సమీపంలోనే ఉండటంతో లోకేష్, చంద్రబాబులు బోండా ఉమమాహేశ్వరరావుకు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.
ఇక మంత్రివర్గ విస్తరణ సమయంలో బోండా ఉమామహేశ్వరరావు తన పేరు లిస్ట్ లో ఉంటుందని గట్టిగా నమ్మారు. కానీ మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో కినుక వహించారు. ఏకంగా చంద్రబాబుపైనే విమర్శలకు దిగారు. కాపుల గొంతు కోశారంటూ విరుచుకుపడ్డారు. దీంతో చంద్రబాబు టీటీడీ బోర్డు సభ్యుడిని చేశారు. అలాంటి బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బోండా ఉమామహేశ్వరరావు ఇప్పుడు టీడీపీిని వీడి వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.కానీ బోండా ఉమామహేశ్వరావు విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి అత్యంత సన్నిహితుడు. కేశినేని నాని కూడా పార్టీపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే బోండా ఉమామహేశ్వరరావు ఇలాంటి ఫిల్లర్ వదిలారా? అన్న అనుమానమూ లేకపోలేదు. వైసీపీలోకి వెళితే ఆయనకు ఒనగూరే ప్రయోజనం పెద్దగా ఏమీ లేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కూడా ఖాళీగా లేదు. మల్లాది విష్ణు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న బోండా ఉమామహేశ్వరరావు బెజవాడకు వస్తే కాని క్లారిటీ రాదంటున్నారు. ఆయన వైసీపీలోకి వెళ్లే ఛాన్స్ లేదంటున్నారు.