యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
మొట్టమొదటి సారిగా తయారైన కియా సెల్టోస్ ఎస్‌యూవీ కారు ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద హ్యూందయ్ భాగస్వామ్యంతో ఆటోమొబైల్ దిగ్గజం ‘కియా’ ఏర్పాటు చేసిన కియా మోటార్స్ ఇండియా నుంచి నూతన సెల్టోస్ కారు ఈనెల 22న లాంచ్ కానుంది. అత్యంత ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా, హూందాతనం ఉట్టి పడే కారు పలు రంగుల్లో అందుబాటులోకి రానుంది. పెట్రోల్, డీజిల్ వెర్షన్‌లో సెల్టోస్ ఎస్‌యూవీ- ఫైవ్ సీటర్ సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది. రూ.25,000 ఇన్‌షియల్ పేమెంట్‌తో ఆన్‌లైన్, షోరూమ్‌లలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. సెల్టోస్ ఎస్‌యూవీ ధర రూ.10 లక్షల నుంచి రూ.17 లక్షల మధ్య 8 వేరియంట్స్‌లో లభ్యమవుతోంది. హెచ్‌టీ లైన్, జీటీ లైన్ ట్రిమ్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తోందని కియా అధికారిక సమాచారంలో వెల్లడించింది. జూలై 16న ఆన్‌లైన్, షోరూమ్‌ల ద్వారా బుకింగ్స్‌ను ప్రారంభించిన కియా మోటార్స్ ఇండియాకు విశేషమైన స్పందన వచ్చింది. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో మొత్తం 6,046 కార్లు ఆన్‌లైన్, షోరూమ్‌ల ద్వారా వినియోగదారులు బుక్ చేసుకున్నారు. ఇందులో ఆన్‌లైన్ ద్వారా 1,628 ఆర్డర్లు వచ్చాయి. ఇప్పటి వరకూ సుమారు 25,000 కార్లను బుక్ చేసుకున్నట్లు కియా అధికారిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాగా ఈనెల తొలి వారంలోనే కార్లను షోరూమ్‌లలో సిద్ధంగా ఉంచే అవకాశాలున్నాయి. ఏటా 3 లక్షల కార్ల ఉత్పత్తి లక్ష్యంగా 214 హెక్టార్ల విస్తీర్ణంలో పెనుకొండ వద్ద కంపెనీ ఏర్పాటయింది. 2019 రెండో త్రైమాసికం నుంచి కార్ల ఉత్పత్తి ప్రారంభించాలని కియా కంపెనీ నిర్ణయించి దిశగా వేగంగా పనులు చేపట్టింది. 2018లో ఢిల్లీలో ఎస్‌పీ 2ఐ పేరుతో షోకేస్డ్ కారును ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. కాగా దేశీయ డిమాండ్‌తో పాటు విదేశాల్లో వినియోగదారుల కోసం ఇక్కడ కార్లు తయారు చేయనున్నారు. ల్యాటిన్ అమెరికా, ఆసియాలోని మధ్య ప్రాశ్చదేశాల మార్కెట్‌లో కూడా లభ్యమయ్యేలా చర్యలు చేపడుతోంది. కాగా 2019 చివరి త్రైమాసికంలో ఈ ఎస్‌యూవీ కార్లను ఎగుమతి చేయనున్నట్లు సమాచారం. కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈనెల 8వ తేదీ కియాను సందర్శించనున్నారు. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది