యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విజయవాడకు వస్తే.. నీకు గుండు కొట్టించి.. ఊరేగిస్తా! అంటూ.. వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాపై ఒంటికాలిపై లేచి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ నేత, పెనమలూరు నుంచి 2014లో గెలిచిన బోడే ప్రసాద్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో తొలిసారి టీడీపీ తరఫున పోటీ చేసిన బోడే ప్రసాద్. ఆ ఎన్నికల్లో దాదాపు 31 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత కాల్‌మనీ కేసులో తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోజా వర్సెస్ బోడే ప్రసాద్‌ల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది.ఇక, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పలుమార్లు మీడియాలో నిలిచారు బోడే ప్రసాద్. స్థానికంగా తమను పట్టించుకోవడం లేదని, ఆయన గెలుపు కోసం తాము ఎంతో కృషి చేశామని, అయితే, ఇప్పుడు వర్గాలుగా మారి.. మాలో మేమే తన్నుకుంటున్నా పట్టించుకోవడం లేదని తమ్ముళ్లు వీధికెక్కిన సమయంలో కూడా బోడే ప్రసాద్ మీడియాలో కీలక నాయకుడిగా మారారు. ఒకానొక టైంలో బోడే ప్రసాద్ కు సీటు రాదని.. ఇక్కడ నుంచి మాజీ మంత్రి నారా లోకేష్ కూడా పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. ఇక బోడే ప్రసాద్ ఎన్నికల్లో మితిమీరిన విజయభరోసాను ప్రదర్శించారు. వైసీపీ తరపున ఇక్కడ బరిలోకి దిగిన మాజీ మంత్రి కొలుసు పార్థసారధి వ్యక్తిగత విషయాలను కూడా మీడియా ముందుకు తెచ్చారు. నేరుగా జగన్‌ను కూడా విమర్శించి వార్తల్లో వ్యక్తిగా మారారు.ఎన్నికల్లో విజయం తనదేనని విశ్వసించిన బోడే ప్రసాద్.. ఫలితం తిరగబడే సరికి ఇప్పుడు ఎక్కడా గడపదాటి బయటకు రాకపోవడం గమనార్హం. నిజానికి ఎన్నికల్లో ఫలితాలువెలువడిన రెండోరోజే తన బుల్లెట్ వాహనంపై నియోజకవర్గంలోని ఇంటింటికీ వెళ్లిన బోడే ప్రసాద్ ప్రతి ఒక్కరినీ పలకరించారు. నన్ను ఎందుకమ్మా ఓడించారు? నేనేం తప్పుచేశానమ్మా? అంటూ ఇక్కడి ప్రజలను ప్రాధేయ పడ్డారు. తన తప్పులు ఏవైనా ఉంటే క్షమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇప్పటి వరకు కూడా బోడే ప్రసాద్ బయటకు రాకపోవడం గమనార్హం. పార్టీ మారే ఉద్దేశం లేక పోయినా.. పార్టీలో మాత్రం ఆయన కీలకంగా లేక పోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.పెనమలూరు టీడీపీకి కంచుకోట. పైగా కీలకమైన విజయవాడ నగరానికి ఆనుకునే ఉంది. ఇలాంటి నియోజకవర్గంలో పార్టీ బాధ్యుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ యాక్టివ్‌గా లేకపోవడం పార్టీ శ్రేణులను కలవర పరుస్తోంది. విపక్షంపై అధికారంలో ఉండగా.. తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బోడే ప్రసాద్ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోవడం వెనుక కాల్‌మనీ కేసులే కారణమై ఉంటాయని అనుకుంటున్నారు. మరి ఆయన ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.