యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నా యి. నదులు, వాగులు పొంగుతుండడంతో వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరి నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. నాసిక్ పట్టణాన్ని వరద ముంచెత్తింది. త్రయంబకేశ్వర ఆలయ ఆవరణలోకి వరదనీరు ప్రవేశించింది. గంగపూర్ డ్యాంలోకి భారీగా వరదనీరు చేరడం తో ఆదివారం 17,748 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. గౌతమి, అలంది, భవాలి, వాల్దేవి వంటి నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నాసిక్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముంబైలో ఆరు రైళ్లు రద్దయ్యాయి. మరో ఆరు రైళ్లను దారి మళ్లించారు. పాల్ఘర్ జిల్లాలో పదికి పైగా ఇళ్లు కూలిపోయాయి. పలు గ్రామాలు జలదిగ్బందంలో చిక్కుకుపోయాయి. పలు ప్రాంతాల్లో వరదనీటిలో పశువులు కొట్టుకుపోయాయని ఫిర్యాదులు అందాయి. గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో కుడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.