యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో అనూహ్యపరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అత్యంత రహస్యంగా వేసిన అడుగులతో చివరికి రాష్ట్రం రెండు ముక్కలైంది. ఎప్పటిలాగే అంతా సాధారణమే అంటూనే కమలనాథులు అసాధారణ నిర్ణయాలు తీసుకుని ఆశ్చర్యపరిచారు. స్వయం ప్రతిపత్తికోల్పోయిన జమ్ముకశ్మీర్ భారత రాజ్యాంగం పరిధిలోకి వచ్చింది. గతనెల 27వ తేదీన సరిహద్దు రాష్ట్రానికి భారీగా కేంద్ర బగా తరలింపుతో మొదలై చివరికి ఈరోజు పార్లమెంటులో వభజన బిల్లు ప్రవేశపెట్టడం, 370 జీవో రద్దుకు చేరుకుంది. ఈ నేపథ్యంతో ఈ వారం రోజుల్లో ఏం జరిగిందో ఓసారి అవలోకిద్దాం.
గతనెల 27న 10వేల మంది భద్రతా బలగాలను (100 కంపెనీలు) కశ్మీర్ లోయకు తరలిస్తున్నట్టు కేంద్రం ప్రకటన చేసింది. ఉగ్రవాదులు సరిహద్దు గుండా చొరబడే ప్రయత్నం చేస్తున్నారని, భారీ ఉగ్రదాడుల సమాచారం నేపథ్యంలోనే ఈ మొహరింపు అని తెలిపింది.
బలగాల మొహరింపుతో జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న అధికరణ 35ఏ ని తొలగించే అవకాశం ఉందని రాష్ట్రంలో ఊహాగానాలు మరునాటికి మొదలయ్యాయి. ఊపందుకున్నాయి. అటువంటి ఆలోచన చేస్తే అంగీకరించమని ప్రధానప్రతిపక్షాలు ప్రకటించాయి.
రాష్ట్రంలోని మసీదులు, వాటి మేనేజ్‌మెంట్ కమిటీలపై వివరాలు అందించాలని 29న పోలీసులు కోరడంతో 35ఏ రద్దు ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
అనుమానాలు ఎక్కువవుతుండడం గమనించిన గవర్నర్ సత్యపాల్ మాలిక్ 30వ తేదీన ఓ ప్రకటన విడుద చేస్తూ, ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలోనే బలగాల మొహరింపు జరిగిందని, వదంతులను నమ్మవద్దని కోరారు.
కేంద్రం చర్యలను అనుమానిస్తున్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జూలై 31న లోయలోని జిల్లాల్లో 35ఏ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇటువంటి చర్యలతో సామాన్య ప్రజల్లో భయాందోళనలు సృష్టించొద్దని బీజేపీ కోరింది.
ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలో ఎన్సీ నేతలు ఈనెల 1న ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. 35ఏ పై ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పరిస్థితులు చేజారిపోతాయని హెచ్చరించారు.
ఉగ్ర ముప్పు నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్టు, యాత్రికులు, పర్యాటకులు వెనక్కి రావాలని ఈనెల 2న కేంద్రం ప్రకటించింది. యాత్ర మార్గంలో భారీ పేలుడు పదార్థాలు సైనికులు స్వాధీనం చేసుకున్నారు.
భారత సైనికుల పోస్టుల లక్ష్యంగా దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన పాక్ బ్యాట్ బృందాన్ని సైన్యం తిప్పికొట్టి, శత్రుమూకను హతమార్చి నట్లు ఆగస్టు 3న కేంద్రం ప్రకటించింది. ప్రధాన పార్టీల నేతలు గవర్నర్‌ని కలిసి కశ్మీర్‌లో ఏం జరుగుతుందో తెలపాలని కోరగా ఉగ్రదాడి నేపథ్యంలోనే బలగాల మొహరింపు అని సత్యపాల్ మాలిక్ స్పష్టం చేశారు.
యుద్ధం వస్తుందనే వదంతులు ఆదివారం వ్యాపించడంతో లోయలోని ప్రజలు నిత్యావసరకులు సమకూర్చుకునేందుకు షాపుల ముందు క్యూ కట్టారు. సరిహద్దు గ్రామాల్లో ప్రజలు భయంతో బంకర్లలో తలదాచుకున్నారు. కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలో అఖిలపక్షం భేటీ అయి 35ఏ రద్దు నిర్ణయం తీసుకుంటే ప్రతిఘటించాలని నిర్ణయించారు. అర్ధరాత్రి మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
ఈరోజు ఉదయం నుంచి పరిణామాలు మరింత వేగంగా జరిగాయి. ఉదయం కేంద్ర కేబినెట్ భేటీ, 370 రద్దు, రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టడం చకాచకా జరిగిపోయాయి.