యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కశ్మీర్‌కు ఇక ప్రత్యేక హోదా ఏదీ లేదు. ఆ రాష్ట్రాన్ని ఇన్నాళ్లూ ప్రత్యేకంగా నిలిపిన ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఇవాళ రాజ్యసభలో దానికి సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రి షా ప్రవేశపెట్టారు. అయితే కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ స్పందించింది. 370 అధికరణ రద్దును ఖండిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి నియమావళికి విరుద్ధంగా ఉందని పాక్ ఆరోపించింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వివాదాస్పద ప్రాంతం కశ్మీర్ అని, ఐక్యరాజ్యసమితి కూడా ఆ ప్రాంతాన్ని అలాగే చూస్తుందని, భారత ప్రభుత్వం కశ్మీర్‌పై ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం కుదరదు అని పాక్ విదేశాంగశాఖ ఓ ప్రకటనలో చెప్పింది. మరో వైపు జమ్ముకశ్మీర్ అంశంలో భారత ప్రభుత్వం ఈరోజు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కాకుండా, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టింది. క్షణాల వ్యవధిలో మారిపోయిన పరిణామాలతో యావత్ భారతదేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరోవైపు, మన దాయాది దేశం పాకిస్థాన్ కూడా అన్ని విషయాలను పక్కన పెట్టేసి, భారత్ లో ఏం జరుగుతోందా? అనే ఉత్కంఠంగా పరిశీలిస్తోంది. అక్కడి మీడియాలో భారత్ కు సంబంధించిన వార్తలే హెడ్ లైన్లలో నిండిపోతున్నాయి.