కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ రాష్ట్ర మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీని గృహనిర్బంధం చేయడం అప్రజాస్వామికమని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మండిపడ్డారు. ఉన్నత స్థానంలో ఉన్న వారిద్దరినీ ఇలా నియంత్రించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.‘జమ్మూకశ్మీర్ అంశం గురించి నేను హెచ్చరించాను.జమ్ముకశ్మీర్ నాయకుల గుహనిర్భంధాన్ని నేను ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య ప్రమాణాలను ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది’ అని ట్వీట్ చేశారు.మరో ట్వీట్‌లో ‘ఈరోజు జమ్ముకశ్మీర్‌లో ఏం జరగబోతుందో మనకి తెలిసిపోతుంది. దీని కోసం నేనూ ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు. శ్రీనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి నుంచి 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. వారిని గడప దాటనివ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. శాంతంగా ఉండాలని ప్రజలకు ఓ ట్వీట్ ద్వారా ఒమర్ విజ్ఞప్తి చేశారు. ‘రేపు ఏం జరగబోతోందో దేవుడికే తెలియాలి. ఈ రాత్రి సుదీర్ఘంగా ఉండబోతోంది’ అని మెహబూబా ట్వీట్ చేశారు.