యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గుంటూరు జిల్లా రైతులు ఈసారైనా ఖరీఫ్ కలిసొస్తుందని రైతులు ఎంతో ఆశపడ్డారు. శ్రీశైలానికి వరదనీటి రాక నిలిచిపోవటంతో సాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదలను తగ్గించారు. దీంతో ప్రాజెక్టులో ఆశించిన మేర నీరు లేకపోవటంతో సాగునీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. సాగునీరు వస్తుందో.. రాదోనని అన్నదాతలు సందిగ్ధంలో ఉన్నారు. జూలై నెలలో మోస్తరు వర్షాలు కురవటంతోపాటు ఎగువ నుండి పెద్ద ఎత్తున వరదనీరు వస్తుండటంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. ఈ ఖరీఫ్‌కు సాగు నీరు వస్తుందని భావించి సాగు పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. సాగర్ ఆయకట్టు పరిధిలో దుక్కులు దున్ని, నారు మడులు పోసుకొని రైతులు సిద్ధంగా ఉన్నారు. మరికొన్ని చోట్ల నారుమడులు పోసుకునేందుకు సిద్ధం చేసుకున్నారు. తీరా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గటంతో వరద నీరు నిలిచిపోయింది. ప్రస్తుతం శ్రీశైలానికి వరదనీటి రాక నిలిచిపోవటంతో ఈ ఖరీఫ్‌లో సాగుకు కష్టమనే సందేహాలు కలుగుతున్నాయి. నీటిని విడుదల చేసి మొదటి జోన్‌కైనా నీరందించాలని అధికార పార్టీ నేతలు, ఆయకట్టు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో సాగర్ ప్రాజెక్టుకు వచ్చే వరదనీటిని బట్టి సాగునీటి విడుదల ఆధారపడి ఉంటుందని కృష్ణా రివర్ బోర్డు తేల్చి చెప్పింది. ప్రస్తుతం తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుండి కుడికాలువకు 30 టీఎంసీలు, ఎడమ కాలువ 20 టీఎంసీల నీటిని తీసుకోవాలని సూచించింది. దీంతో ఈనెల 10వ తేదీ నుండి తాగునీటి అవసరాల నిమిత్తం కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీశైలంకు వరదనీరు రాకపోవటం, భవిష్యత్తులో వచ్చే అవకాశం తక్కువగా ఉండటంతోపాటు ప్రాజెక్టులో నీటిని నిలవచేసి రెండవ పంటకైనా నీరు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఖరీఫ్‌లో సాగునీటి విడుదల కష్టంగా మారింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 872.80 అడుగులు ఉండగా ఇది 153.51 టీఎంసీలకు సమానం. శ్రీశైలం జలాశయం నుండి దిగువకు 19605 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 514.10 అడుగులకు చేరుకుంది. ఇది 138.74 టి ఎంసిల నీరు నిల్వ ఉంది. సాగర్ ఆయకట్టు పరిధిలో ఈనెల చివరికి వరినాట్లు వేసుకుంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో పంట చేతికందుతుంది. ఆలస్యంగా సెప్టెంబర్ 15 నాటికి నాట్లు వేసుకుంటే ఆ ప్రభావం దిగుబడిపై పడే ప్రమాదం ఉంది. గత ఖరీఫ్‌లో సాగునీరు లేకపోవటంతో చివరి దశలో వరిపంట ఎండిపోయింది. తాగునీటి అవసరాల కోసం ఈనెల 10 నుండి కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయనున్నారు.