ఫిబ్రవరి 18న త్రిపురలో, 27న నాగాలాండ్, మేఘాలయలో పోలింగ్
మార్చి 3న ఫలితాలు
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల పోలింగ్ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఫిబ్రవరి 18న త్రిపుర, ఫిబ్రవరి 27న నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలకు ఒకే విడతలో పోలింగ్ పూర్తి కానున్నది. పోలింగ్ కేంద్రాలన్నిటిలోనూ ఈవీఎంలకు ఓటర్ పరిశీలనా పత్రాల(వీవీపీఏటీ) యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 3న వెల్లడి కానున్నాయి. మార్చి 6తో మేఘాలయ, మార్చి 13తో నాగాలాండ్,మార్చి 14తో త్రిపుర అసెంబ్లీల కాలపరిమితి పూర్తి కానున్నది. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో గురువారం నుంచే ఎన్నికల కోడ్ అమలు కానున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఏకె జోతి తెలిపారు. ప్రస్తుతం త్రిపురలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం, నాగాలాండ్‌లో నాగా పీపుల్స్ ఫ్రంట్, మేఘాలయలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి.