యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జమ్మూకశ్మీర్ పునర్ విభజన బిల్లుపై చర్చ సందర్భంగా లోక్ సభలో కాంగ్రెస్ నాయకుల వైఖరిపై... ఆ పార్టీ అగ్రనాయకత్వం ఫుల్ సీరియస్ గా ఉందట. దేశప్రజలందరి ముందు సెల్ఫ్ గోల్ చేసుకునేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించారని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఫీల్ అయ్యరట. జమ్మూకశ్మీర్ అంతర్గత విషయం కాదంటూ కాంగ్రెస్ లోక్ సభ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీని అంతర్మధనంలో పడేసింది.మొత్తం జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని లోక్ సభ 1994 లో చేసిన తీర్మానాన్ని ప్రస్తావిస్తూ.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (pok) పై ప్రభుత్వ వైఖరి అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలను చేయాలని ప్రతిపాదించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలను కిటికీలోంచి విసిరేసిందని ఆయన అన్నారు. మీరు పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి బీజేపీ ఆలోచిస్తున్నట్లు తాను అనుకోవట్లేదని, కేంద్రం అన్ని నియమాలను ఉల్లంఘించిందని, రాత్రికిరాత్రి ఓ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతగా మార్చారని చౌదరి అన్నారు.అయితే అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ...సాధారణ ప్రకటన చేయవద్దు అని చౌదరికి చెప్పారు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, విడదీయరాని భాగం అని తాను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని షా అన్నారు. దీనిపై ఎటువంటి సందేహం లేదని, చట్టపరమైన వివాదం లేదని అమిత్ షా నొక్కిచెప్పారు.దీంతో ఏం మాట్లాడాలో కొద్ది సేపు ఆలోచించిన చౌదరి చౌదరి... నాకు ఓ సందేహం ఉంది. ఎందుకంటే ఇది అంతర్గత విషయం అని మీరు అంటున్నారు. మీరు ఒక రాష్ట్రాన్ని విభజించారు. నా ఉద్దేశ్యం ఏమిటంటే, 1948 నుండి కాశ్మీర్‌ను ఐరాస పర్యవేక్షిస్తోంది, అది అంతర్గత విషయమా? మేము సిమ్లా ఒప్పందం, లాహోర్ ప్రకటనపై సంతకం చేసాము, అది అంతర్గత విషయం లేదా ద్వైపాక్షికమా? విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. యుఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపీతో మాట్లాడుతూ కశ్మీర్ ద్వైపాక్షిక సమస్య, జోక్యం చేసుకోవద్దన్నారు. ఆ తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్ అంతర్గత విషయంగా ఉండగలదా? మీరు వివరించాలి అని చౌదరి అన్నారు.ఈ సమయంలో చౌదరి పక్కనే కూర్చున్న సోనియా గాంధీ, తన కొడుకు రాహుల్ వైపు తిరిగి చూస్తూ, ఆమె షాక్‌కి గురైనట్లు సైగ చేసినట్లు కనిపించింది. రాహుల్ గాంధీ తల కొద్దిగా వణుకుతూ కనిపించాడు. బీజేపీ నాయకులు షేమ్...షేమ్ అంటూ బల్లలు చరుస్తున్న సమయంలో మీరు పొరపాటుపడ్డారు.. మీరు తప్పుగా భావిస్తున్నారు అని చౌదరి అన్నారు. నేను మీకు జ్ఞానోదయం కావాలనుకుంటున్నాను. ఇది ప్రాథమిక ప్రశ్న. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ మొత్తం.. మీకు జ్ఞానోదయం కావాలని కోరుకుంటుంది. సోనియా గాంధీ ఇప్పుడు అసౌకర్యంగా కనిపించారు.వెంటనే అమిత్ షా ఆగ్రహంతో ఊగిపోయారు. మీరు జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో అంతర్భాగంగా పరిగణించలేదా? మీరేం చెబుతున్నారు? జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. నేను జమ్మూ కాశ్మీర్ అని చెప్పినప్పుడల్లా, పీఓకే (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్) దాని కిందకు వస్తుంది. పీఓకే జమ్మూ కాశ్మీర్ కిందకు వస్తుందని మీరు అనుకోవట్లేదు కనుకనే నేను దూకుడుగా ఉన్నాను పీఓకే కోసం ప్రాణత్యాగానికైనా సిద్దమని షా అన్నారు. షా వ్యాఖ్యలతో లోక్ సభలోని అనేకమంది ఎంపీ భారత్ మాతాకీ జై,వందేమాతరం అంటూ బల్లలు చరిచారు. అయితే తన వ్యాఖ్యలపై తర్వాత చౌదరి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు.