YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీజేపీ నెక్స్ట్ర్ టార్గెట్ అయోధ్యేనా...

బీజేపీ నెక్స్ట్ర్ టార్గెట్ అయోధ్యేనా...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కశ్మీర్ విషయంలో కేంద్రం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోపాటు జమ్మూ కశ్మీర్‌ను రెండుగా విభజించింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఈ అంశంపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విభజించడం రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టికల్ 370ని ఏకపక్షంగా రద్దు చేయలేరని కాంగ్రెస్ వాదిస్తోంది. హస్తం నేతల మాటలకు అమిత్ షా అంతే దీటుగా బదులిస్తున్నారు. కశ్మీర్ మాత్రమే కాదు.. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్‌లో భాగమేనని ఉద్ఘాటించారు. అవసరమైతే కశ్మీర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత బీజేపీ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఎన్నికల హామీలో కనిపించే అంశాల్లో అయోధ్య రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి లాంటి అంశాలు కనిపిస్తాయి. ఇవి అమలు చేయకపోవడంతో.. బీజేపీ ఈ హామీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుంటుందనే విమర్శలొచ్చాయి. కానీ 2019 ఎన్నికల్లో మోదీ అఖండ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వచ్చాక బీజేపీ సర్కారు దూకుడు పెంచింది. రాజ్యసభలో పూర్తి బలం లేకపోయినప్పటికీ.. ఇతర పార్టీల సహకారంతో కీలక బిల్లులను పాస్ అయ్యేలా చూస్తోంది. ట్రిపుల్ తలాక్ బిల్లును ఇలాగే రాజ్యసభలో ఆమోదించారు. తర్వాత ఆర్టికల్ 370ని కూడా ఆమోదించారు. ఈ రెండు బిల్లులు కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమోదం పొందాయి. అయోధ్య వివాదం కూడా దాదాపు చివరి దశకు వచ్చేసింది. వీటి తర్వాత బీజేపీ ఉమ్మడి పౌర స్మృతిపై దృష్టి సారించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ అదేమీ అంత తేలికైన వ్యవహారం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఉమ్మడి పౌర స్మృతిని తెలియజేస్తుంది. ఉమ్మడి పౌర స్మృతి మతానికి సంబంధించింది. ఆదేశిక సూత్రాల్లోని ఈ ఆర్టికల్ కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉంది. దేశంలోని చట్టాలన్నీ పౌరులకు ఒకే విధంగా వర్తిస్తాయి. కానీ మతం పునాదిగా ఉన్న కట్టుబాట్లు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. ప్రతి మతానికి విడివిడిగా పౌర స్మృతి ఉంది. దీని ప్రకారం ఇస్లాంలో బహుభార్యత్వం సమ్మతమే. కానీ హిందువుల్లో ఇది నిషిద్ధం. భారతీయ జన సంఘ్ కాలం నుంచి ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలనే డిమాండ్ ఉంది. దీనికి ప్రధానంగా ముస్లిం పర్సనల్‌ లాను మార్చాల్సి ఉంటుంది. ఇప్పటికే ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా మార్చిన కేంద్రం.. మెల్లగా.. ఉమ్మడి పౌర స్మృతి కోసం చట్టాలను ఒక్కొక్కటిగా సంస్కరించుకుంటూ పోయే అవకాశం ఉంది. ఉమ్మడి పౌరస్మృతిని తేవాలన్న కేంద్రం ఆలోచనలకు ఏడాది క్రితం లా కమిషన్‌ కళ్లెం వేసింది. భారత్‌లాంటి భిన్న సంప్రదాయాలున్న దేశంలో ప్రస్తుతం ఉమ్మడి పౌర స్మృతిని తేవడం అవసరం లేదని అభిప్రాయపడింది.

Related Posts