YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సోనియా గాంధీని అడ్డుకున్న సుష్మా

సోనియా గాంధీని అడ్డుకున్న సుష్మా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:   

దేశ రాజకీయాల్లో అగ్ర నాయకురాలిగా ఎదిగిన సుష్మాస్వరాజ్‌.. ఒకానొక దశలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో పోటీపడ్డారు. మొదటిసారి సోనియా జాతియతను ప్రశ్నించడంతో సుష్మా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అంతేకాదు సోనియా ప్రధాని అయితే గుండు గీయించుకుంటానంటూ సుష్మా చేసిన ప్రమాణం ఆనాడు తీవ్ర కలకలం రేపింది. సుష్మా స్వరాజ్ సోనియా చేతిలో 1999లో ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల్లో బళ్లారి నుంచి బరిలోకి దిగిన సోనియా గాంధీని ఎదుర్కొనేందుకు.. బీజేపీ సుష్మాను ప్రధానాస్త్రంగా ప్రయోగించింది. 1999 లోక్ సభ ఎన్నికల్లో సోనియా బళ్లారి నుంచి పోటీ చేయగా.. బీజేపీ సుష్మా స్వరాజ్‌ను ఆమెకు ప్రత్యర్థిగా నిలిపింది. విదేశీ కోడలికి, స్వదేశీ కూతురికి మధ్య పోటీగా బళ్లారి ఎన్నికను బీజేపీ ప్రచారం చేసింది. ఎన్నికల్లో సుష్మా కాంగ్రెస్ అధినేత్రికి ధీటుగా ప్రచారం నిర్వహించారు. నుదుటున పెద్ద బొట్టు, చీరకట్టుతో అచ్చమైన భారత నారిగా సుష్మా ప్రజల మదిలో నిలిచిపోయారు. బీజేపీ సుష్మాను ఆదర్శ భారత మహిళగా అభివర్ణించింది. అయితే ఆ ఎన్నికల్లో సోనియా సుష్మాను 56 వేల ఓట్ల తేడాతో ఓడించారు. కానీ కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. అనంతరం 2004 ఎన్నికల్లో యూపీఏ పక్షం మెజార్టీ సాధించింది. దీంతో సోనియా ప్రధాని పగ్గాలు చేపట్టాలని యూపీఏ భాగస్వామ్య పార్టీల నేతలు కోరారు. సోనియా ప్రధాని పీఠం మీద కూర్చుంటే.. తాను గుండు కొట్టించుకొని, తెల్ల చీర కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తానని సుష్మా స్వరాజ్ సంచలన ప్రకటన చేశారు. బ్రిటిషర్ల పాలన ముగిసినా కూడా.. సుదీర్ఘ పోరాటం అనంతరం దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా భారతీయులు ఇటలీలో జన్మించిన సోనియాను ప్రధానిగా ఎన్నుకోవడం ఏంటని సుష్మా ఆవేదన వ్యక్తం చేశారు.సోనియా ప్రధానిగా పగ్గాలు చేపట్టడం తగదంటూ.. సుష్మా స్వరాజ్ ఉధ్యమం ఉధృతం చేశారు.. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో సోనియా గాంధీ ప్రధాని పదవి తనకు వద్దని ప్రకటించాల్సి వచ్చింది.
తెలంగాణ చిన్నమ్మగా పేరు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మాస్వరాజ్ పాత్ర మరువలేనిది. తెలంగాణ చిన్నమ్మగా... ఆమె ఎప్పటికీ గుర్తుండిపోతారు. తెలంగాణతో అనుబంధం పెంచుకున్న సుష్మా.... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిచ్చారు. అంతేకాదు తెలంగాణ కోసం పార్లమెంట్‌లో బలమైన వాణి వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీజేపీ జాతీయ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన కృషి వెలకట్టలేనిది.. ప్రతిపక్ష నేతగా పార్లమెంటులో సుష్మ స్వరాజ్ అనేక మార్లు తెలంగాణ వాణిని వినిపించారు. తెలంగాణ ప్రజల గొంతును వినాలని ఆమె పార్లమెంటులో డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కళ్లకు కట్టినట్లు పార్లమెంటులో వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడంలో కూడా ఎంతో కృషి చేశారు.. తెలంగాణ చిన్నమ్మగా తనను గుర్తు పెట్టుకోవాలని ఆమె పార్లమెంటు వేదికగా కోరారు. 2017 నవంబర్ లో హైదరాబాదులో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో.. విదేశాంగ శాఖ మంత్రి గా పాల్గొన్న సుష్మా ఆ సమయంలో తెలంగాణను అభివర్ణిస్తూ తనను అందరూ తెలంగాణ చిన్నమ్మ అని పిలుస్తారని తెలిపారు.. తనకు తెలంగాణ సంస్కృతి సుపరిచితమని కూడా తెలిపారు.

Related Posts