యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న రైతులు ఖరీఫ్ గండం ఎలా గట్టెక్కుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో కంటే భిన్నంగా ఈ యేడు రైతులు పూర్తి స్థాయిలో ఖరీఫ్ సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ యేడైనా ఖరీఫ్ గట్టెక్కుతుందా అని రైతులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ముందస్తుగానే వర్షాలు కురుస్తాయన్న అంచనాతో పొలం పనులు చేయడంలో రైతన్నలు బిజిబిజీగా కనిపిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. నాలుగు మండలాల్లో ఖరీఫ్‌లో 40వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వ్యవసాయ సాగు చేపడుతారు. నియోజకవర్గంలో ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, ఆముదం, ఉల్వలు, కందులు, వరి, పెసర్లు, కూరగాయల పంటలను సాగు చేస్తారు. నియోజకవర్గాన్ని తొలకరి జల్లులు పలకరించినప్పటికి ఇప్పటికి ఒక్క జోరు వాన కురిసింది లేదు. కురుస్తున్న వర్షాలు చిరుజల్లులకే పరిమితమవుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో రైతన్నలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. పదేళ్లుగా నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండడంతో ఖరీఫ్, రబీ సీజన్‌లలో వ్యవసాయ సాగు అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. దీంతో రైతులు భారీ మొత్తంలో వ్యవసాయానికి స్వస్తి పలుకుతున్నారు. ఎన్ని మార్లు వరుణుడు తమపై ప్రభావాన్ని చూపి నష్టాలను మిగుల్చుతున్నా, ఈ యేడాదైనా వర్షాలు కురుస్తాయన్న ఆశతో రైతులు ప్రతి సారి ఖరీఫ్‌లో సాగుకు సన్నద్దమవుతున్నారు. బోరుబావుల్లో నీటి లభ్యత లేకపోవడం, బోర్లు వేసినా నీరు పడకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారుప్రస్తుతం పత్తి, మొక్కజొన్న మినహా ప్రత్నామ్యాయ పంటల సాగు అంతగా అనుకూలించడం లేదు. ప్రభుత్వం సూచించిన ప్రకారం కంది, పెసర, మినుము తదితర పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. వరి, కూరగాయల పంటలు సాగు చేయడానికి బోరుబావుల్లో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిందని ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఏ పంటలు సాగు చేయాలో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు.వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ సాగుకు రైతులు దూరమవుతుండడంతో ప్రభుత్వం దిగివచ్చింది. వ్యవసాయ సాగుకు రైతులను సమాయత్తం చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రైతులు స్వతహాగా నిర్ణయాలు తీసుకొని పంటలు సాగు చేసి నష్టాల పాలుకావద్దని, వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి సలహాలు, సూచనలు పొందాలని రైతుల్లో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. పూర్తిగా వర్షాభావంపైనే ఆధారపడ్డ రైతులతో వ్యవసాయాన్ని పండగ చేసే విధంగా ప్రభుత్వం ప్రత్నామ్యాయ చర్యలకు పూనుకుంటోందనడంలో సందేహంలేదు. ఏది ఏమైనప్పటికి తొలకరి పలకరింపుతో ప్రారంభమైన ఖరీఫ్ సాగుపై వర్షాభావ పరిస్థితుల ప్రభావం భారీగా ఉండనుంది.