యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
చాణక్య చంద్రగుప్తుల గురించి చరిత్రలో వినడమే తప్ప చూసినవారు లేరు. అనుకున్న లక్ష్యాలను చేరుకోడానికి, ఆటంకాలు అధిగమించడానికి , పరిపాలనలో పట్టు సాధించడానికి వారు అనుసరించిన వ్యూహాలు చిలువలుపలువలుగా చెప్పుకుంటుంటాం. అనేక సందర్భాల్లో మన చట్టసభల్లో సైతం ఆనాడు వారు నెలకొల్పిన కొన్ని ప్రమాణాలను సూక్తులుగా ప్రస్తావించుకుంటుంటాం. నరేంద్రమోడీ, అమిత్ షా ల ద్వయాన్ని చూసినవారికి చాణక్యచంద్రగుప్తులు గుర్తుకు రాకమానరు. ఎంతో ముందుచూపుతో దేశసమగ్రత, సార్వభౌమత్వం విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలు దీర్గకాలంగా పెండింగులో ఉన్న అంశాలకు ముగింపు పలుకుతాయని దేశంలోని మెజార్టీ ప్రజలు విశ్వసిస్తున్నారు. రాజకీయంగా మంచి చెడులను చరిత్ర బేరీజు వేస్తుంది. భిన్నమైన అభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయి. వ్రణంగా మారిన సమస్యలకు స్వస్తి పలకపోతే శరీరం మొత్తం వ్యాపించే ప్రమాదం ఉంటుంది. తక్షణం కాయకల్ప చికిత్స చేయాలి. ఇప్పటికే రకరకాల రాజకీయ సమీకరణలతో ముదరబెట్టిన సున్నితమైన సుందర కశ్మీరం సమస్య భారత గుండెల్లో లావా పొంగిస్తోంది. రావణకాష్ఠంగా రగులుతోంది. రాజకీయ పార్టీలు అన్నీ ఈ సమస్య తీరిపోవాలని ఆశిస్తాయి. వాంఛిస్తాయి. కానీ తమ రాజకీయ ప్రయోజనాల వద్దకు వచ్చేసరికి ఆగిపోతుంటాయి. అక్కడే దేశంలో ఏకాభిప్రాయం కరవు అవుతోంది. ఈ దశలో కశ్మీర్ విషయంలో పడిన అడుగు హిస్టారికల్ పొలిటికల్ మైల్ స్టోన్.రాజకీయ నాయకునికి, రాజనీతిజ్ణునికి తేడా చెప్పమంటే అందరూ ఒకటే చెబుతారు. ప్రస్తుత ఎన్నిక గురించి ఆలోచించేవాడు నాయకుడైతే.. రేపటి తరాన్ని గురించి యోచించేవాడు రాజనీతిజ్ణుడు. కశ్మీర్ విషయంలోనూ జరిగిందదే. అప్పటికున్న పరిస్థితులను ద్రుష్టిలో పెట్టుకుని తాత్కాలిక ప్రొవిజన్ కింద 370 అధికరణను రాజ్యాంగంలోకి తెచ్చి పెట్టారు. అదే దేశసార్వభౌమత్వానికి ధిక్కరణగా పరిణమించింది. దేశంలో ఇతర ప్రాంత పౌరులకు తాము అతీతమనే భావన నెలకొనడానికి, స్థానికుల్లో పెరిగిపోవడానికి అదే ఆర్టికల్ దోహదం చేసింది. ఈ నిబంధనలతో లభించే అదనపు అధికారాలతో అక్కడి రాచరిక వారసత్వ కుటుంబాలు ప్రత్యేక ప్రివిలేజ్ లు పొందడానికి అలవాటు పడిపోయాయి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలకు , భారత ప్రభుత్వానికి మధ్య దూరాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. తామే కేంద్రసర్కారుకు, రాష్ట్రప్రజలకు వారధులుగా శాశ్వతంగా ఉండిపోవాలని తలపోశారు. ఫలితమే నేటికీ కొనసాగుతున్న సంఘర్షణ. తొలి తరంలో షేక్ అబ్దుల్లా నెహ్రూల స్నేహం. మలితరంలో ఫరూక్ అబ్దుల్లా రాజీవ్ ల సాన్నిహిత్యం, మూడో తరంలో ఒమర్, రాహుల్ ల ఫ్రెండ్ షిప్ పదిలంగా ఉండేలా చూసుకున్నారు. తమలాగే కశ్మీర్ ప్రజలతో దేశానికి కలివిడి తనం పెంచడానికి ప్రయత్నించలేదు.పౌర స్వేచ్ఛ విషయంలో భారతదేశానిది ఎన్నదగిన ట్రాక్ రికార్డు. ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ బద్ధత ఉంది. దేశంలో ఎక్కడైనా నివసించడానికి , ఆస్తి హక్కు కలిగి ఉండటానికి చట్టబద్ధత ఉంది. దేశంలో , ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత పెంచడానికి అనేక చట్టాలు ఉన్నాయి. కానీ వాటికి జమ్ముకశ్మీర్ లో మన్నన దక్కలేదు. సమాచార హక్కు చట్టం వంటివి ఇంకా ప్రజల చేతిలోకి చేరలేదు. దేశంలో పంచాయతీలకు నేరుగా కేంద్రం నుంచి నిధులు చేరుతుంటే జమ్ముకశ్మీర్ లో మాత్రం రాష్ట్రం ఉక్కు పిడికిలిలో నిధులు బిగపడుతుంది. రిజర్వ్ డ్ వర్గాలు సామాజికంగా ఎదగడానికి దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు అమలు చేస్తుంటారు. కానీ కశ్మీర్ లో అది వర్తించదు. ఇలా అనేక విధాలుగా పౌరహక్కులకు భంగం వాటిల్లడం కశ్మీర్ ప్రత్యేకతగా నిలిచింది. కశ్మీర్ అంటే అబ్దుల్లా కుటుంబం, ముఫ్తీల కుటుంబం,సజ్జాద్ లోన్ కుటుంబం, అన్సారీ కుటుంబం అన్న ముద్ర పడిపోయింది. ప్రజలకు సంబంధించిన అంశాల కంటే వారసత్వ రాజకీయాలు, వంతుల వారీ అధికారం, వాటాలు వేసుకోవడమనే సంప్రదాయం స్థిరపడిపోయింది. దీనికోసమే కశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టడం సాగుతూ వచ్చింది. పాకిస్తాన్ నుంచి సాగుతున్న ద్రోహచింతన తమకే రకంగా ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే నడిచాయి అక్కడి రాజకీయాలు. ఫలితంగానే తాత్కాలిక ఏర్పాటుగా వచ్చిన 370 అధికరణ శాశ్వతంగా తిష్ఠ వేసింది. దాని జోలికెళ్లాలంటే ఢిల్లీ పెద్దలు భయకంపితులయ్యేలా పరిస్థితిని కల్పించారు కశ్మీరీ నేతలు. భారతమాత కీర్తికిరీటంలో మణిమకుటంగా భాసిస్తూ కనిపిస్తుంది జమ్ము కశ్మీర్. ప్రకృతి సంపదకే కాదు, భౌగోళికంగానూ ఆ ప్రాంతానికి ఉండే ప్రత్యేకత భారతావనికే అలంకారం. భిన్నత్వంలో ఏకత్వానికి నిజమైన నిదర్శనం. నిరంతరం సైన్యం పదఘట్టనలతో కాకుండా భారత పౌరులందరితో సమానంగా అక్కడి ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకొనేందుకు తాజా చర్య దోహదపడినప్పుడే భారత ప్రభుత్వ సాహసం ఫలించినట్లు చెప్పాలి. కశ్మీరీ ప్రజల భావోద్వేగాలను భారత్ తో సంలీనం కాకుండా నేతలు పన్నిన కుట్రలకు చరమగీతం పాడాలి. అయితే ఒక అనుమానమూ వ్యక్తమవుతోంది. సుందర కశ్మీరాన్ని కార్పొరేట్లు కబళించివేస్తారేమోననే అనుమానం దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఆ విషయంలో విచక్షణ పాటించాల్సి ఉంటుంది. ఉపాధి కల్పన పేరుతో పర్యావరణాన్ని, ప్రజాజీవితాన్ని పణంగా పెట్టకుండా తగు షరతులు, ఆంక్షలు అమలు చేయాలి. కశ్మీర్ సంస్క్రుతి సంప్రదాయాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రం పై ఉంటుంది. శాంతి సుస్థిరతలు నెలకొని ఉపాధి అవకాశాలు పెరిగి స్థానిక ప్రజల్లో అనుమానాలు, సందేహాలకు తెరపడినప్పుడు ఈ స్వప్నం సాకారమవుతుంది. తప్పొప్పులు సమయం సందర్బాన్ని బట్టి చూడాలి తప్పితే వాటికి శాశ్వతత్వం ఉండదు. నెహ్రూ కాలంలో ఏం జరిగింది? వాజపేయి పాలనలో ఎందుకు రద్దు చేయలేకపోయారు? మోడీ తీసుకున్న ఈ నిర్ణయం సాహసమా? దుస్సాహసమా? వంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. అయితే భారత దేశ చరిత్రలో స్వాతంత్ర్యానంతర కాలంలో మోడీ, అమిత్ షాల నిర్ణయం మేలి మలుపుగా మెజార్టీ ప్రజల మన్నన దక్కించుకోవడం గుర్తించదగిన అంశం.