యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ హఠాన్మరణం పట్ల అమెరికా అధ్యక్షుడి సీనియర్ సలహాదారు, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుష్మాజీ ఓ ఛాంపియన్ అని కొనియాడారు. భారత్ ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ‘విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ అకాల మరణంతో అంకితభావం గల నాయకురాలిని, ప్రజాసేవకురాలిని భారత్ కోల్పోయింది. భారత్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆమె ఓ ఛాంపియన్. ఆమెతో పరిచయం ఉండటం గౌరవంగా భావిస్తున్నా’ అని ఇవాంక ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భారత పర్యటన సమయంలో సుష్మాస్వరాజ్‌తో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా సుష్మా మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘నా స్నేహితురాలు, భారత మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మరణం బాధాకరం. ఆమె బలమైన నేత. ఎన్నో విషయాల్లో మా అభిప్రాయాలను ఆమెతో పంచుకున్నాం. ఆమె కుటుంబానికి, భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని పాంపియో ట్వీటర్‌లో పేర్కొన్నారు.