యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కర్ణాటకలో కృష్ణానది మహోగ్ర రూపం దాల్చింది. నిన్న కురిసిన భారీ వర్షాలకు, పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ, ఆ నీరంతా కృష్ణా, తుంగభద్ర నదుల్లో కలుస్తున్నాయి. ఇదే సమయంలో మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు ఉజ్జయిని నది ఉప్పొంగుతోంది. దీంతో నదిలో వరద భారీగా పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. మరికొన్ని గంటల్లో ఆల్మట్టి, జూరాలకు వస్తున్న వరద 5 లక్షల క్యూసెక్కులను దాటుతుందని, వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతామని కర్ణాటక ఇంజనీర్లు తెలుగు రాష్ట్రాల అధికారులకు సమాచారం అందించారు.ఇదిలావుండగా, వరదల కారణంగా మహారాష్ట్రలో 16 మంది, కర్ణాటకలో ఏడుగురు మరణించినట్టు సమాచారం. మహారాష్ట్రలో 67 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, మరో 40 వేల మందిని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. కర్ణాటక పరిధిలోనూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని 10 జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేయగా, అధికారులు అప్రమత్తం అయ్యారు.మరోవైపు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కావేరీ నదిలో వరద క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.