YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

దూకుడును తగ్గించు కోండి...పాక్ కు అమెరికా హెచ్చరిక

దూకుడును తగ్గించు కోండి...పాక్ కు అమెరికా హెచ్చరిక

ఆర్టికల్‌ 370ని భారత్‌ రద్దు చేసిన తర్వాత పాకిస్థాన్ చూపిస్తున్న అత్యుత్సాహంపై అమెరికా నీళ్లు చల్లింది. ఈ విషయంలో పాక్‌కు మొట్టికాయలు వేసింది. ఇరు దేశాల వైఖరిని గమనిస్తున్నామని తెలిపింది. భారత్‌తో వాణిజ్యం రద్దు, దౌత్య సంబంధాలను కనిష్ఠ స్థాయికి చేర్చడం, హైకమిషనర్‌ అజయ్‌ బిసారియా బహిష్కరణ తదితర అంశాలపై అమెరికా స్పందించింది.‘జమ్మూకశ్మీర్‌లో పరిపాలన, కేంద్ర పాలిత ప్రాంతాలు తదితర అంశాలపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా గమనిస్తోంది. ఆయా అంశాల్లో చోటు చేసుకుంటున్న పురోగతులను మేం చూస్తూనే ఉన్నాం. పాకిస్థాన్‌ తన దూకుడును తగ్గించుకోవాలి. ఎల్‌ఓసీలో అక్రమ చొరబాట్లకు మద్దతివ్వడం ఆపేయాలి. పాకిస్థాన్‌ గడ్డమీద ఉగ్రవాద మూలాలపై  చర్యలు తీసుకోవాలి’ అని అమెరికా తెలిపింది.జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 సహా పలు అధికారాలను రద్దు చేయడంపై పాక్‌ తీవ్రంగా స్పందించింది. భారత్‌తో దౌత్య సంబంధాలు తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు అత్యవసరంగా భేటీ అయిన ఆ దేశ జాతీయ భద్రతా కమిటీ భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు నిలిపివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని భారత రాయబారిని బహిష్కరించింది. పాకిస్థాన్‌ హై కమిషనర్‌ను భారత్‌కు పంపరాదని నిర్ణయించింది. అయితే, వచ్చే నెలలోనే పాక్‌ హైకమిషనర్‌ భారత్‌లో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. పాక్‌లోని భారత హైకమిషనర్‌నూ వెనక్కి వెళ్లాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా రండి.. అందరూ రండి.. ఈ అన్యాయాన్ని చూడండి.. ఖండించండి.. ఎవరైనా అడ్డుకోండి.. అంటూ కశ్మీర్‌పై పాకిస్థాన్‌ చేసిన ప్రకటనలను  అంతర్జాతీయ సమాజం అంతగా పట్టించుకోలేదు. ఓఐసీ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌, ఏవో ఒకటి రెండు దేశాలు పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడినా.. పెద్దగా ప్రయోజనం లేదు. బాగా నమ్ముకొన్న కొన్ని దేశాలైతే పాక్‌కు షాక్ ఇచ్చాయి కూడా. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం ఆర్టికల్‌ 370 రద్దు చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా స్పందనలు లేవు.  అంతర్జాతీయ సమాజం భారత్‌ను తప్పుపడుతుందని ఆశించిన పాక్‌కు ఈ విషయంలో చుక్కెదురైంది. భారత్‌ నిర్ణయం వెలువడిన వెంటనే విదేశాంగ శాఖ అంతర్జాతీయంగా ఎటువంటి వ్యతిరేకత రాకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయింది. అత్యంత శక్తివంతమైన పీ5 దేశాల (అమెరికా, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్‌) రాయబారులను ఆహ్వానించి కశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని వెల్లడించింది. వీటిల్లో ఒక్క చైనా మినహా భారత్‌కు వ్యతిరేకంగా మరే దేశం ప్రకటన చేయలేదు.

Related Posts