యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజాకు శ్రీనగర్ ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. శ్రీనగర్ కు చేరుకున్న వీరిద్దరినీ అధికారులు విమానాశ్రయంలోనే ఆపేశారు. బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. శుక్రవారం ముస్లింల ప్రార్థనల సందర్భంగా కశ్మీర్ లో కర్ఫ్యూని సడలించే యోచనలో అధికారులున్నందున... వారిని నగరంలోకి అడుగుపెట్టనివ్వలేదు.
ఈ సందర్భంగా మీడియాతో ఫోన్ లో ఏచూరి మాట్లాడుతూ, శ్రీనగర్ లోకి ప్రవేశం లేదంటూ లీగల్ ఆర్డర్ ను అధికారులు చూపించారని తెలిపారు. భద్రతా కారణాల వల్ల ఎస్కార్ట్ తో వెళ్లడానికి కూడా అనుమతించలేదని చెప్పారు. అక్కడి సీపీఎం మాజీ ఎమ్మెల్యే తరిగామి ఆరోగ్యం బాగాలేకపోవడంతో తాము అయనను ని పరామర్శించనున్నామని వామపక్ష నేతలు ముందుగా ప్రకటించారు. అనారోగ్యంతో ఉన్న తరిగామిని పరామర్శించేందుకు జమ్మూ కాశ్మీర్ కు వస్తున్నామని, భద్రతా అధికారులెవరూ తమ పర్యటనకు ఆటంకం కలిగించకుండా చూడాలంటూ.. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సీతారాం ఏచూరి లేఖ రాశారు. శుక్రవారం వచ్చిన ఏచూరి, రాజాలను పోలీసులు వెనక్కి పంపారు.