యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కాళేశ్వరం ప్రాజక్టు గురించి జయప్రకాశ్ నారాయణకు ఏం తెలుసు? జయప్రకాశ్ నారాయణ తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి అంటూ సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల లోక్ సత్తా అధినేత స్పందించారు. అమెరికాలో ఉన్న ఆయన ఓ తెలుగు న్యూస్ చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమం, వాస్తవాలు, లాజిక్ తప్ప మరో విషయం చర్చకు రాకూడదని అభిప్రాయపడ్డారు. ఎదుటి వాళ్లు చెబుతున్నది హేతుబద్ధంగా ఉందా? లేదా? వాళ్లు చెబుతున్నది పాటిస్తే ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుందా? లేదా? అనేది ఆలోచించాలే తప్ప, అసంబద్ధ ఆరోపణలకు ఆస్కారం ఉండకూడదని అన్నారు.ఎప్పుడైతే వాదన లోపిస్తుందో అప్పుడే ఎదుటివాళ్లపై ఆరోపణలు చేయడం జరుగుతుందని జేపీ విశ్లేషించారు. తన వద్ద వాస్తవాలు లేనప్పుడు, తర్కబద్ధంగా మాట్లాడలేనప్పుడే ఇతరులను తిడుతుంటారని కేసీఆర్ కు చురకలంటించారు. ఇలాంటి సమయాల్లోనే కోపం తెచ్చుకోవడమో, ఉద్వేగాలు రెచ్చగొట్టడమో చేస్తుంటారని అన్నారు.ఓ మనిషికి వాదించడానికి ఏమీ దొరకనప్పుడే 'నీ కులం ఇది, నీ మతం ఇది, నీ ప్రాంతం' ఇది అనే అంశాలు తెరమీదకు వస్తుంటాయని విమర్శించారు. సరైన వాదన ఉంటే దాన్నే వెలిబుచ్చుతారు తప్ప ఇలాంటి అర్థంలేని వ్యాఖ్యలు చేయరని లోక్ సత్తా అధినేత పేర్కొన్నారు.