YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కమలంలో చార్మిష్ లీడర్లకు ... అనారోగ్యాలు

కమలంలో  చార్మిష్ లీడర్లకు ... అనారోగ్యాలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

బీజేపీ, వామపక్ష పార్టీలు దేశంలో సిధ్ధాంత నిబధ్ధత కలిగిన పార్టీలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ పార్టీలను రాజకీయ నాయకులను తయారు చేసే కర్మాగారాలుగా పిలుస్తారు. ఇపుడు దేశంలో వామపక్ష ఉద్యమం క్రమంగా బలహీనపడుతోంది. అదే సమయంలో రైటిస్ట్ పార్టీగా ఉన్న బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పులలో భాగంగా చూడాలి. పెద్దన్నగా ప్రపంచానికి చెప్పుకునే అమెరికాలోనే సంకుచిత ధోరణులు ఎక్కువయ్యాయి. కాబట్టే లోకల్ నినాదంతో ట్రంప్ ప్రెసిడెంట్ గా వచ్చారు. ఇపుడు భారత్ లో కూడా నేనూ నా దేశం అన్న నినాదం బలపడుతోంది. దాంతో వామపక్షాలకు అవకాశాలు తగ్గాయనుకోవాలి. ఓ విధంగా ప్రపంచీకరణ పర్యవసానాలతో విశ్వమంతా ఒక్కటి అన్న భావన వెల్లివిరుస్తుందని అంతా అనుకున్న అంచనాలు తప్పు అవుతున్నాయి. ముందు నేను అన్న స్వార్ధం అధికమవుతోంది. దీంతో ఇపుడు బీజేపీకి మంచి రోజులు వచ్చాయి.జనసంఘ్ ఏర్పాటై దాదాపుగా ఇప్పటికి ఏడు దశాబ్దాల కాలం గడచింది. తరువాత బీజేపీగా రూపాంతరం చెంది నలభయ్యేళ్ళు దాటుతున్నాయి. ఆనాడు ఒక్క ఎంపీ సీటు గెలుచుకోవాలంటే తల్లకిందులుగా తపస్సు చేయాల్సివచ్చిన రోజుల్లో అద్వాని, వాజ్ పేయ్ ఉభయులూ నిబ్బరంగా నిలబడి బీజేపీని కాపు కాస్తూ వచ్చారు. దాన్ని అందిపుచ్చుకుని దూకుడు రాజకీయాలు చేస్తూ అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నారు మోడీ, అమిత్ షా ద్వయం. ఇదిలా ఉంటే బీజేపీకి ఇవి బంగారం లాంటి రోజులు. దేశంలో ఎదురులేదు. కనీసంగా నిలిచే జాతీయ పార్టీ సమీపంలో లేదు. జనం కూడా గట్టిగా నమ్మి ఆదరిస్తున్నారు. బీజేపీది పిడివాదం అన్నవారే ఇదే ఇపుడు కరెక్ట్ అంటున్నారు. రెండవసారి బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇపుడు మరిన్ని టెర్ములు అధికారం కోసం గట్టి టార్గెట్లు పెట్టుకుని సాగుతోంది.సరిగ్గా ఇటువంటి సమయంలో బీజేపీకి మరో వైపు శాపాలుగా కొన్ని సంఘటనలు పరిణమిస్తున్నాయి. బీజేపీ ఎదుగుదలలో అన్నీ తామై ఉన్న వారంతా ఒక్కొక్కరుగా నేల రాలిపోతున్నారు. గత ఏడాది మాజీ ప్రధాని వాజ్ పేయ్ ఇదే ఆగస్ట్ లో కన్నుమూస్తే ఇపుడు మేటి నాయకురాలైన సుష్మా స్వరాజ్ ఆకస్మికంగా మరణించడం పెను విషాదాన్ని నింపింది. దీనికి ముందు గోవా ముఖ్యమంత్రి పారికర్ చనిపోయారు. అంతకు ముందు కర్నాటక రాజకీఎయల్లో దిగ్గజ సమానుడు అనంతకుమార్ హెగ్డే మృతి చెందారు. ఇక గత ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా చక్రం తిప్పిన అరుణ్ జైట్లీ ఇపుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దానికి కారణం ఆయన అనారోగ్యమే. ఇంకో వైపు కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న నితిన్ గడ్కరీ తరచూ అనారోగ్యం పాలు అవుతున్నారు. ఇవన్నీ బీజేపీకి కలవరపెట్టేవే. బీజేపీకి మంచి నాయకులను తయారుచేసుకునే సత్తా ఉంది. కానీ వీరంతా మరింత కాలం ఉండాల్సిన వారు. పార్టీకి వెలుగు రేఖల్లాంటి వారు. వీరు కన్ను మూయడం మాత్రం బీజేపీకి తీరని నష్టాన్ని కలిగిస్తోంది. కష్టాలన్నీ దాటుకుని తీరం చేరిన వేళ మిగిలిన వారికి ఆ ఆనందం లేకుండా సహచరులు దూరం కావడం నిజంగా విషాదమే.

Related Posts